భీమవరంలో రౌడీ షీటర్ల హల్ చల్…

భీమవరంలో రౌడీ షీటర్ల హల్ చల్…

కారుతో గుద్ది.. కత్తులతో వెంటాడి
ప్రత్యర్థిని హతమార్చేందుకు విఫలయత్నం
త్రుటిలో తప్పించుకున్న రఘు వర్గం
కోర్టు సమీపంలో జరిగిన దాడితో ఉలిక్కిపడ్డ భీమవరం
పశ్చిమలో కొరవడుతున్న ప్రశాంతత

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రశాంతతకు నిలయమైన పశ్చిమగోదావరి జిల్లాలో హత్యలు, దాడులు, ప్రతి దాడులు వంటి అలజడలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా కేంద్రమైన భీమవరంలో గత రెండేళ్లలో జరుగుతున్న సంఘటనలతో ప్రజలు తమ ప్రశాంతతను కోల్పోతున్నారు. తాజాగా శుక్రవారం పాత కక్షలు నేపథ్యంలో భీమవరంలో ఓ వ్యక్తిని చంపేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై కారుతో ఢీ కొట్టి, కత్తులతో వెంటాడారు. ఈ సంఘటన సంబంధించి స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం చెందిన రౌతుల రఘు అనే రౌడీషీటర్ ఓ కేసు విచారణలో భాగంగా భీమవరంలోని డిఎన్ఆర్ రోడ్ లో ఉన్న కోర్టుకు శుక్రవారం వచ్చాడు ఈ విషయం తెలుసుకున్న మరో రౌడీషీటర్ గోవింద్ అతన్ని హతమార్చాలని ప్లాన్ తో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు.

రఘు కోర్టు నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతున్న సమయంలో అక్కడికి వచ్చిన రౌడీషీటర్ గోవిందు తన కారుతో రఘు కారును వేగంగా ఢీ కొట్టించాడు. ఈ పరిణామంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన రఘు అప్రమత్తమై తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరుగులు తీశాడు. గోవింద్, అతని అనుచరులు కత్తులతో దాడి చేయడానికి పరుగులు పెట్టారు. ఈ సంఘటన చూసిన ఆ ప్రాంతవాసులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు చెందారు. ఏం జరుగుతుందో తెలియక భయపడిపోయారు. రఘు తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం సమీపంలోని ఓ అపార్ట్మెంట్లోకి వెళ్లి దాకున్నాడు. రఘు తప్పించుకోవడంతో గోవింద్ అతని అనుచరులు అక్కడ నుంచి పరారయ్యారు. 2017లో పోలీసులు రఘు పై నమోదు చేసిన కేసుకు సంబంధించి రఘు వర్గం శుక్రవారం కోర్టుకు హాజరయ్యాడు.

ఈ సంఘటనలో రఘుతో పాటు గ్రూపులోని సభ్యులు కూడా దాడుల నుండి తప్పించుకున్నారు. రఘు తనపై జరిగిన దాడి వివరాలను పోలీసులకు తెలపడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సంఘటన స్థలాన్ని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, టూ టౌన్ సీఐ కాళీచరణ్ లు పరిశీలించారు.


2022 డిసెంబర్ 24వ తేదీన రఘు సోదరుడు యేసుపై ప్రత్యర్ధులు బీసీ కాలనీలో అర్ధరాత్రి దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత కాలంలో గొల్లవానితిప్ప రోడ్లో క్రిమినల్ కోర్టుకు సమీపంలో పంట కాలువ రోడ్డుపై విజయ్ అనే యువకుడు హత్య కావించబడ్డాడు . ఈ దాడిలో గోవింద్ తృటిలో తప్పించుకుని బయటపడ్డాడు. హంతకులు మరణాయుధాలతో కత్తులతో ఆనాడు దాడి చేశారు. యేసును హత్య చేసిన ముఠాలోని విజయ్ పై ప్రతీకారంగా అతని సోదరుడు రఘు గ్రూపు ఆ హత్య చేసినట్లు టూ టౌన్ పోలీసులు ఆనాడు కేసు నమోదు చేశారు. సుమారు ఆరుగురుపై కేసు నమోదు చేశారని చెబుతున్నారు.

మారుతి కారులో రఘు గ్రూపు కోర్టు విచారణకు హాజరుకాగా ప్రత్యర్థులు కూడా లాయర్ కాలర్ సింబల్ వేసి ఉన్న మారుతి కారులో వచ్చి కోర్టు వద్ద రఘు గ్రూపు కారును ఢీకొట్టారు. అయితే ఈ మెరుపు సంఘటనలో రఘు గ్రూపు సభ్యులు తప్పించుకున్నారు. ప్రత్యర్థులు తాము వేసుకున్న స్కెచ్ విఫలం కావడంతో కోర్టు ఎదురుగా ఉన్న రోడ్డు నుండి తప్పించుకుని పారిపోయారు. ప్రత్యర్థి ముఠా సభ్యులు ముఖాలకు మాస్కులు ముసుగులు వేసుకువచ్చారని చెబుతున్నారు. సంఘటన గురించి తెలుసుకున్న టూ టౌన్ సీఐ కాళీ చరణ్ సంఘటన స్థలానికి చేరుకుని కారులను పరిశీలించి అక్కడ నుండి రఘు గ్రూప్ పై దాడి చేసి ప్రత్యర్థులు వెళ్లిపోయిన ప్రాంతాలను పరిశీలించారు.


భీమవరం, ఉండి నియోజకవర్గాలు కలిసే ఉంటాయి. ఇక్కడ ఏ సంఘటన జరిగిన రెండు ప్రాంతాలపై ఒకే విధంగా ప్రభావం కనిపిస్తుంది. 2024లో ఉండి మండలం యండగండిలో డెడ్ బాడీ డోర్ డెలివరీ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తులసి ఆస్తికోసం ఆమె సోదరి, సోదరి భర్త కలిసి చేసిన ఈ దారుణం తీవ్రస్థాయిలో సంచలనంగా మారింది. ఈ దారుణానికి పాల్పడిన వారు చివరికి కటకటాల పాలయ్యారు.
గత ఏడాది నవంబర్ లో భీమవరంలోని సుంకర పెద్దయ్య వీధిలో సోదరుడును, తల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన పెను సంచలనంగా మారింది. మానసిక స్థితి సరిగా లేని అతను తన సోదరుడు ,తల్లిని కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపటం జరిగింది. ఉండి మండలంలో సహజీవనం చేస్తున్న ఓ మహిళను, వ్యక్తిని వేరువేరు ప్రాంతాల్లో హత్య చేసి పడవేశారు. ఈ సంఘటన వివాహేతర సంబంధానికి బలవుతున్న ప్రాణాలకు నిదర్శనంగా నిలిచిందని చర్చించుకున్నారు.


గత ఏడాది భీమవరంలో మద్యం మత్తులో ఓ ముఠా విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి చేయడమే కాకుండా అతని సెల్ఫోన్ లాక్కుని నేలకి కొట్టారు. ఆలస్యంగా వెళ్లేలోకి వచ్చిన ఈ సంఘటన లో కానిస్టేబుల్ పై దాడి చేసిన రాకేష్, నజీర్, నూర్ భాషాలను పోలీసులు అరెస్టు చేశారు. భీమవరం పోలీస్ బొమ్మ సెంటర్లో బస్సులో వెళ్తున్న విద్యార్థిని పై అసభ్యంగా ప్రవర్తించారు. యువకులను ప్రశ్నించిన తోటి విద్యార్థిపై ఆ యువకులు దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గంజాయి మత్తులో ఈ సంఘటన జరిగిందని, గంజాయి సేవించి ఆ యువకులు బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని భావించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించడంతో ఆ యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటువంటి సంఘటనలతో పశ్చిమ లో ప్రశాంతత కొరపడుతుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుని, రౌడీషీటర్ల, పై అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వారిపై ఉక్కు పాదం మోపాలని ప్రజల కోరుతున్నారు.


భీమవరంలో రఘు పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే నాలుగు బృందాలను ఏర్పాటు చేసి హత్యాయత్నానికి యత్నించిన ఐదుగురు వ్యక్తులను పట్టుకోవడానికి చర్యలు చేపట్టాం. ఈ సంఘటన జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాం.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Leave a Reply