రోహిత్‌, కోహ్లీకి 2027 ప్రపంచకప్‌లో చోటు ప్ర‌శ్నార్థ‌కం

ఆ టోర్నీ త‌ప్ప‌క ఆడాలి..
ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీ (దేశవాళీ వన్డే టోర్నమెంట్)లో కోహ్లీ, రోహిత్ తప్పక పాల్గొనాలి. ఈ టోర్నీలో ఆడకుండా నేరుగా భారత జట్టులోకి రావడానికి అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టేనని ఆ కథనాలు పేర్కొంటున్నాయి. టెస్టులు, టీ20లకు దూరమవ్వడంతో వారికి మ్యాచ్ ప్రాక్టీస్ గణనీయంగా తగ్గనుంది. ఈ నేపథ్యంలో వారి ఫిట్‌నెస్, ఫామ్‌ను అంచనా వేయాలంటే దేశవాళీ క్రికెట్టే సరైన మార్గమని సెలక్టర్లు భావిస్తున్నారు.

ప్ర‌పంచ క‌ప్ ప్ర‌ణాళిక‌లో వారులేరు..?
“2027 ప్రపంచకప్ కోసం మేము రూపొందిస్తున్న ప్రణాళికల్లో కోహ్లీ, రోహిత్ లేరు” అని టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన ఒక కీలక వ్యక్తి చెప్పినట్టు స‌మాచారం. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలని ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆసక్తి చూపినా, జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు లేవని సెలక్టర్లు వారికి ముందే సూచించారని, అందుకే వారు ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారని కూడా ఆ కథనంలో పేర్కొన్నారు.

గిల్‌ను అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా చేయాలని…
టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ విజయవంతం కావడం, యువ ఆటగాళ్లు నిలకడగా రాణిస్తుండటంతో జట్టులో మార్పులకు ఇదే సరైన సమయమని సెలక్షన్ కమిటీ బలంగా నమ్ముతోంది. భవిష్యత్తులో గిల్‌ను అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీసే కోహ్లీ, రోహిత్‌ల అంతర్జాతీయ కెరీర్‌కు చివరి సిరీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దశలో వారు దేశవాళీ క్రికెట్‌కు తిరిగి రావడం దాదాపు అసాధ్యమని భావిస్తున్నారు. టీ20, టెస్టుల్లో విజయవంతంగా జరిగిన తరాల మార్పిడి ఇప్పుడు వన్డేల్లోనూ జరగనుండటంతో ఈ దిగ్గజాల భవిష్యత్తు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply