రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమం గ్రామసభలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమాల ఇటుకాలపెళ్లి సర్పంచ్ సుమలత శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, కార్లలో సీట్‌బెల్ట్ పెట్టుకోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని స్పష్టం చేశారు. అలాగే అధిక వేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు.

ప్రతి కుటుంబానికి ఆదారమైన వ్యక్తి ప్రమాదంలో పడితే ఆ కుటుంబం ఆర్థికంగా, భావోద్వేగంగా తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్నారు. ఒక నిర్లక్ష్యం వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హైవేలు, గ్రామ రోడ్లపై ట్రాక్టర్లు, ఇతర వాహనాలు నడిపేవారు అధిక శబ్దంతో మ్యూజిక్ వినడం, సెల్‌ఫోన్ మాట్లాడడం వంటి అలవాట్లను మానుకోవాలని సూచించారు. ఇటువంటి చర్యలు తమకే కాకుండా ఎదుటివారికి కూడా ప్రమాదకరమని తెలిపారు.
ప్రత్యేకంగా స్కూల్ బస్సు డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని, పిల్లల ప్రాణాలు అత్యంత విలువైనవని గుర్తుచేశారు. భవిష్యత్తు తరానికి మేలు చేసే పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. “మన ప్రాణాలను కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. రోడ్డు నియమాలను పాటిస్తేనే మనం సురక్షితంగా గమ్యానికి చేరగలము” అని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థాయి అధికారులు, గ్రామ ప్రజలు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
