Ro-Ko | దేశవాళీ టోర్నీలో దుమ్ము రేపిన దిగ్గజాలు…

Ro-Ko | దేశవాళీ టోర్నీలో దుమ్ము రేపిన దిగ్గజాలు…
ఆంధ్రప్రభ : విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ఆరంభమే అదిరిపోయింది. బీసీసీఐ నిబంధనల మేరకు దేశవాళీ బరిలోకి దిగిన టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ బ్యాటింగ్‌తో స్టేడియాలను హోరెత్తించారు. ఏళ్ల విరామం తర్వాత ఈ టోర్నీలో అడుగుపెట్టిన వీరు, వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ రికార్డుల వేట సాగించారు.
హిట్ మ్యాన్ షో…
జైపూర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన రోహిత్ శర్మ పాత రోజులను గుర్తుచేశాడు. సుమారు 7 ఏళ్ల తర్వాత విజయ్ హజారే టోర్నీ ఆడుతున్న రోహిత్, కేవలం 61 బంతుల్లోనే మెరుపు శతకం బాది తన కెరీర్లోనే అత్యంత వేగవంతమైన లిస్ట్-ఏ సెంచరీని నమోదు చేశాడు.

మొత్తం 94 బంతుల్లో 155 పరుగులు (18 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసిన రోహిత్ ఇన్నింగ్స్‌లో 80 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే రావడం గమనార్హం. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ టోర్నీలో మళ్ళీ సెంచరీ మార్కును అందుకున్నాడు హిట్ మ్యాన్. అయితే, రోహిత్ ప్రతాపానికి ముంబై జట్టు 237 పరుగుల లక్ష్యాన్ని కేవలం 30.3 ఓవర్లలోనే ఊదేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆట ఏదైనా వేట విరాట్ దే !!
మరోవైపు, విజయ్ హజారే ట్రోఫీలో 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అడుగుపెట్టిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, తన రాకను ఘనంగా చాటుకున్నాడు. బుధవారం బెంగళూరులో ఆంధ్ర జట్టుతో జరిగిన ఎలైట్ ఫేజ్ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కోహ్లీ, క్లాసిక్ సెంచరీతో చెలరేగి స్టేడియాన్ని హోరెత్తించాడు.

ఆంధ్ర విసిరిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ అర్పిత్ రాణా వికెట్ పడటంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఆది నుంచే ఎంతో ఏకాగ్రతతో ఆడుతూ… కేవలం 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన విరాట్, ప్రియాంశ్ ఆర్య (74)తో కలిసి రెండో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
కోహ్లీ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో ఆంధ్ర బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ కేవలం 83 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు. నితీష్ రాణాతో కలిసి ఢిల్లీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను భుజాన వేసుకున్న కోహ్లీ 131 పరుగుల (101 బంతులు, 14 ఫోర్లు, 3 సిక్సర్లు) వద్ద అవుట్ అయ్యాడు. 33వ ఓవర్లో బౌలర్ పీవీఎస్ఎన్ రాజు అద్భుతమైన రిటర్న్ క్యాచ్ పట్టడంతో విరాట్ ఇన్నింగ్స్ ముగిసింది. అప్పటికే ఢిల్లీ జట్టును పటిష్ట స్థితిలో నిలబెట్టిన కోహ్లీ, తన అద్భుత ఫామ్‌తో 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో తాను ఎంత బలంగా ఉన్నానో మరోసారి నిరూపించాడు.
సచిన్ రికార్డ్ బద్దలు..
ఈ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించాడు. పురుషుల లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 391 ఇన్నింగ్స్‌ల్లో సాధించిన ఈ మైలురాయిని, విరాట్ కేవలం 330 ఇన్నింగ్స్‌ల్లోనే అధిగమించి టాప్ గేర్‌లోకి దూసుకెళ్లాడు. 2009 తర్వాత తొలిసారి ఈ టోర్నీలో ఆడుతున్న విరాట్, అద్భుత సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించగా.. బౌలింగ్‌లో సిమర్జీత్ సింగ్ 5 వికెట్లతో చెలరేగి ఆంధ్ర జట్టును కట్టడి చేశారు.
టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయినప్పటికీ 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా రో-కో సాగిస్తున్న ఈ ప్రయాణం యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తోంది. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టులో విరాట్, శార్దూల్ ఠాకూర్ నేతృత్వంలోని ముంబై జట్టులో రోహిత్ ఆడుతుండటం ఈ సీజన్ విజయ్ హజారే ట్రోఫీకి ఐపీఎల్ రేంజ్ గ్లామర్‌ను తెచ్చిపెట్టింది.
