హైదరాబాద్ : టాలీవుడ్ సినీ ప్రపంచంలో మరో దిగ్గజం కన్నుమూశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తండ్రి, అనుభవజ్ఞుడైన రచయిత శివశక్తి దత్తా (92)..సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని మణికొండలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతి చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు, రచయితల సంఘాలు శ్రద్ధాంజలి అర్పిస్తున్నారు.
శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. చిన్నతనంలోనే కళలపై విపరీతమైన ఆసక్తితో ముంబైకి వెళ్లి ఓ ఆర్ట్స్ కాలేజీలో చేరారు. అక్కడ చిత్రకళపై ప్రావీణ్యం సాధించారు. అనంతరం ‘కమలేశ్’ అనే కలం పేరుతో చిత్రకారుడిగా కొంతకాలం పనిచేసాడు. కానీ అక్కడే ఆగిపోలేదు. సంగీతం పట్ల మక్కువతో గిటార్, సితార్, హార్మోనియం వంటి వాద్యాలను నేర్చుకున్నారు.అలా శివశక్తి దత్త సినీరంగంలో ప్రవేశించిన అనంతరం తన సోదరుడు విజయేంద్ర ప్రసాద్ తో కలిసి పనిచేయడం ప్రారంభించారు.
1988లో విడుదలైన ‘జానకి రాముడు’ సినిమా ద్వారా శివశక్తి దత్తా రచయితగా మంచి గుర్తింపు పొందారు. ఆపై ఆయన రచించిన పాటలు, స్క్రీన్‌ప్లేలు తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి.శివశక్తి దత్త రచించిన కొన్ని ప్రముఖ పాటల..బాహుబలి: (మమతల తల్లి), (ధీవర) బాహుబలి 2: (సాహోరే బాహుబలి),ఆర్ఆర్ఆర్: (రామం రాఘవమ్), హనుమాన్ (అంజనాద్రి థీమ్ సాంగ్), సై (నల్ల నల్లని కళ్ళ పిల్ల) , చత్రపతి: (మన్నేల తింటివిరా),రాజన్న: (అమ్మ అవని) ఈ పాటలు ఒక్కొక్కటీ గుండెను తాకే భావోద్వేగాలను కలిగించాయి. శివశక్తి దత్తా తన పదాలకు ప్రాణం పోసే శైలితో, పాటలను ఒక ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లారు.