RIP | బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ కన్నుమూత

ముంబ‌యి – హిందీ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ (54) కన్నుమూశారు. ‘సన్ ఆఫ్ సర్దార్’, ‘ఆర్.. రాజ్‌కుమార్’, ‘జై హో’ వంటి సినిమాలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. అంతే కాదు తెలుగులో ‘కృష్ణ’, ‘ఏక్ నిరంజన్’, ‘కేడీ’, ‘అదుర్స్’ వంటి తదితర చిత్రాల్లో ఆయన నటించారు.ఆయన ఆకస్మిక మరణం బాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఈ వార్త తెలిసిన ఆయన స్నేహితులు శనివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే, ముకుల్ దేవ్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ముకుల్ దేవ్, ప్రముఖ నటుడు రాహుల్ దేవ్‌కు సోదరుడు. ఆయన చివరిగా ‘అంత్ ది ఎండ్’ అనే హిందీ సినిమాలో కనిపించారు.

న్యూఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించిన ముకుల్ దేవ్ తండ్రి హరి దేవ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారు. ఆయన ద్వారానే ముకుల్ దేవ్‌కు ఆఫ్ఘన్ సంస్కృతి పరిచయమైంది. ఆయన తండ్రి పష్తో, పర్షియన్ భాషలు మాట్లాడగలిగేవారు. అంతేకాకుండా, ముకుల్ దేవ్ ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ నుంచి పైలట్‌గా కూడా శిక్షణ పొందారు.

నటనపై ఆసక్తితో ముకుల్ దేవ్ ఎనిమిదో తరగతిలోనే తొలి పారితోషికం అందుకున్నారు. దూరదర్శన్ నిర్వహించిన ఓ డ్యాన్స్ షోలో మైఖేల్ జాక్సన్‌ను అనుకరించి ఆయన ఈ గుర్తింపు పొందారు. 1996లో ‘ముమ్కిన్’ అనే టెలివిజన్ సీరియల్‌లో విజయ్ పాండే పాత్రతో నటనారంగంలోకి అడుగుపెట్టారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఏక్ సే బధ్ కర్ ఏక్’ అనే కామెడీ బాలీవుడ్ కౌంట్‌డౌన్ షోలో కూడా ఆయన నటించారు. ‘ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా’ మొదటి సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక సినిమాల విషయానికొస్తే, ‘దస్తక్’ చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. ఈ సినిమాలో ఏసీపీ రోహిత్ మల్హోత్రా పాత్రలో ఆయన నటించారు. ఈ చిత్రంతోనే మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ కూడా వెండితెరకు పరిచయమయ్యారు. ముకుల్ దేవ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply