JOB | ఉర్దూ అకాడమీకి పునర్వైభవం..

JOB | ఉర్దూ అకాడమీకి పునర్వైభవం..


భాషాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా..
ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ షుబ్లి..

JOB | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఉర్దూ అకాడమీలో ఉద్యోగం చేసి జీతాలు తీసుకునే వారికి ప్రాధాన్యం ఇస్తామని, పని చేయకుండా కేవలం గౌరవ వేతనాలు, పెన్షన్ మాదిరిగా జీతాలు పొందే వారిని ఉపేక్షించబోమని ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ షుబ్లి స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతాయుతమైన చైర్మన్ పదవికి పూర్తి న్యాయం చేస్తానన్నారు. గతంలో ఏడాదిపాటు జీతాలు పెండింగ్‌లో ఉండేవని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో సకాలంలో ఉద్యోగులందరికీ జీతాలు అందుతున్నాయని, కాబట్టి ఉద్యోగులు తీసుకునే జీతానికి తగ్గట్టుగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. తన హయాంలో ఉద్యోగులను పరిగెత్తిస్తానని, తను పని చేసిన కాలం అకాడమీ చరిత్రలో స్వర్ణ యుగంలా ఉండబోతుందని పేర్కొన్నారు.

గతంలో ఎవరూ అడగలేదు కాబట్టి, పని చేయలేదని చెబితే ఊరుకునేది లేదని, ఏ విభాగంలో లేని విధంగా 159 మంది ఉద్యోగులు ఉర్దూ అకాడమీలో ఉన్నారని, వీరందరినీ సద్వినియోగం చేసుకునేలా శ్రమిస్తానని పేర్కొన్నారు. పని చేసిన వారికి గుర్తింపు కూడా అదే విధంగా లభిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రభత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఉర్దూ రెండో అధికార భాషగా ఉన్నందున ప్రతి ప్రభుత్వ కార్యాలయం (Government office) వద్ద ఏర్పాటు చేసే బోర్డుల్లో ఉర్దూ వినియోగం ఉండేలా చూస్తామన్నారు. ఆయా నగరాల్లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కనిపించే ‘ఐ లవ్ ఆంధ్రప్రదేశ్’ వంటి బోర్డులను ఉర్దూ పదాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరాన్ని బట్టి ఉర్దూ అనువాదకులను అందుబాటులో ఉంచుతామని షుబ్లి పేర్కొన్నారు. మదరసా మోడరనైజేషన్ కింద ఉర్దూ భాష అభివృద్ధికి అకాడమీ కృషి చేస్తుందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కింద ఉర్దూలో డీటీపీ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తామని షుబ్లి వివరించారు.

Leave a Reply