Revanth Reddy| పాత మంత్రుల శాఖ‌ల‌లో మార్పులుండ‌వ్… నా వ‌ద్ద శాఖ‌ల‌నే కొత్త మంత్రుల‌కు కేటాయిస్తా

నా వ‌ద్ద శాఖ‌ల‌నే కొత్త మంత్రుల‌కు కేటాయిస్తా
కెసిఆర్ తో స‌హా ఆ కుటుంబ అంతా నా శ‌త్రువులే
తాను కాంగ్రెస్ లోఉండ‌గా వారంద‌రికి హ‌స్తం పార్టీలోకి నో ఎంట్రీ
తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్న‌ది కిష‌న్ రెడ్డే
కెటిఆర్ సూచ‌న‌తోనే మెట్రోకు కిష‌న్ అడ్డుపుల్ల
ఢిల్లీ లో మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి

న్యూ ఢిల్లీ – కొత్త మంత్రులకు తన వద్ద ఉన్న శాఖలనే కేటాయించనున్నట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy) చెప్పారు.. పాత మంత్రుల శాఖల్లో ఎటువంటి మార్పులు ఉండ‌వ‌ని ఆయ‌న సంకేతాలు ఇచ్చారు.. ఢిల్లీ పర్యటనలో (Delhi Tour) ఉన్న ఆయన ఇవాళ తన పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయల్దేరే ముందు ఢిల్లీలో మీడియాతో (Media) చిట్‌చాట్ నిర్వహించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని, కొత్త మంత్రులకు (New Ministers) శాఖల కేటాయింపుల అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. హైదరాబాద్‌కు వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామన్నారు. తాను ఢిల్లీకి వచ్చింది కర్ణాటకలో కులగణన అంశంపై అధిష్టానంతో చర్చించేందుకేనని చెప్పారు. తెలంగాణలో కులగణన (Caste Census) నిర్వహణ అంశాన్ని పార్టీ పెద్దలతో చర్చించినట్లు స్పష్టం చేశారు. అయితే పాత మంత్రుల శాఖ‌ల‌ను మార్పు చేసే అవ‌కాశం లేద‌న్నారు. త‌న వ‌ద్ద ఉన్న హోం, మున్సిపల్, క్రీడలు, విద్య తో పాటు 11 శాఖల‌లోని కొన్నింటికి కొత్త‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన వారికి కేటాయిస్తామని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్‌లో ఎంట్రీ లేదు..

కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని సీఎం రేవంత్ రెడ్డి అని స్ప‌ష్టం చేశారు. తానున్నంత వరకు కాంగ్రెస్‌లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ రౌడీ సినిమాలో బాషా గ్యాంగ్ మాదిరిగా బీఆర్ఎస్ నేతల పంచాయతీ ఉందని విమర్శించారు. మీడియా దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కిషన్‌రెడ్డి ఒక్కటేనన్నారు. 2-3 రోజుల్లో కాళేశ్వరంపై మీడియాతో మాట్లాడుతానని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు బయటపెడతానని చెప్పారు.

తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్న‌ది కిష‌న్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నదని ఆయనేనని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి ఆయన ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని, కేబినెట్ మంత్రిగా తెలంగాణ అంశాలపై తనతో కిషన్‌రెడ్డి ఒక్క రివ్యూ కూడా జరపలేదన్నారు. మెట్రో విస్తరణ కేటీఆర్‌కు ఇష్టం లేద‌ని అంటూ దీని కార‌ణంగానే కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఫెయిల్ అయ్యారని విమర్శించారు.

Leave a Reply