స్వస్థలాకు తరలింపు కార్యక్రమం ప్రారంభం
ముందుగా వారందర్ని ఢిల్లీకి తరలింపు
ఎపి, తెలంగాణ భవన్ తో తాత్కాలిక నివాసం
అక్కడ నుంచి వారి గ్రామాలకు పంపే ఏర్పాట్లు
విద్యార్ధుల తరలింపును స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
భారత్ – పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ముకశ్మీర్, పంజాబ్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులను త్వరితగతిన వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. ఇక ఇండియా పాక్ వార్ నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్లలో టోల్‌ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు పెద్ద ఎత్తున కాల్స్ వస్తున్నాయి. జమ్ము కాశ్మీర్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు కాల్స్ చేస్తున్న పరిస్థితి. పంజాబ్, జమ్ములో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులను రోడ్డు మార్గంలో ఢిల్లీకి చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వారిని స్వస్థలాలకు తరలించనున్నారు. ఇక జమ్ము, పంజాబ్ రాష్ట్రాల్లో అర్ధరాత్రి వేళల్లో ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుండగా.. ఉదయం సేఫ్ జోన్‌గానే ఉంటోంది. అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులను బస్సుల్లో, ఇతర వాహనాల్లో వారి వారి స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా కాలేజీ యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులను ఢిల్లీలోని తెలంగాణ, ఏపీ భవన్లకు తరలిస్తుండగా.. మరికొంతమందిని నేరుగా వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కశ్మీర్ విశ్వవిద్యాలయాలోని తెలుగు విద్యార్ధులు ఒక లేఖ రాశారు.. తమను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాలని కోరారు.. దీనిపై స్పందించిన అయన కశ్మీర్ లోని అధికారులతో మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల విద్యార్ధులను త్వరగా వారి వారి ప్రాంతాలకు పంపాలని కోరారు.. ఎప్పటికప్పుడు ఆ విద్యార్ధుల సమాచారం తనకు అందించాలని కోరారు.