- జీవీఎంసీ లో 20 వసంతాల వేడుకలు
ఆంధ్రప్రభ, ఆరిలోవ విశాఖపట్నం : విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గా ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీలో 20 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశాఖ నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీకి సకాలంలో బాధ్యతతో ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను చెల్లించిన ఆస్తిపన్ను దారులను “విశాఖ ప్రగతి బంధు” పేరున అభినందించి , ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
వారందరికీ జీవీఎంసీ తరఫున విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వసంతాల వేడుకలు సందర్భంగా నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్ డివి రమణమూర్తి, డిసిఆర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులతో కలసి కేక్ ను కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి గ్రేటర్ విశాఖపట్నంగా జీవీఎంసీ ఆవిర్భవించి 20 వసంతాలు నిండటం విశాఖవాసులకు గర్వకారణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో విశాఖ ప్రగతి పథములో ముందని, ఇక్కడ ప్రజలు బాధ్యతతో నిర్ణీత కాలంలో జీవీఎంసీకి ఆస్తి ,ఖాళీ స్థలాల పన్నులు ,నీటి చార్జీలు చెల్లించి సహకరిస్తున్నందుకు జీవీఎంసీ ప్రజలందరికీ రుణపడి ఉందని ఈ సందర్బంగా విశాఖ ప్రగతి బందు వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషానిస్తుందని మేయర్ అభిప్రాయపడ్డారు.

