నిజామాబాద్ కళాశాలకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు..

నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ రాష్ట్ర స్థాయి ఉత్తమ కళాశాల అవార్డు అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆదివారం జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్‌తో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్‌లు అభినందనలు తెలిపారు.

పలు ప్రమాణాల ఆధారంగా నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఉత్తమ కళాశాలగా ఎంపిక చేశారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ అవార్డు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ మాట్లాడుతూ, కళాశాల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ కృషి ప్రశంసనీయమని తెలిపారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపు, క్రమశిక్షణ, సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణలో కళాశాల ఆదర్శంగా నిలిచిందన్నారు.

ఈ అవార్డు కళాశాల సిబ్బందికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బంది ప్రిన్సిపాల్ బుద్దిరాజ్‌ను అభినందిస్తూ కళాశాలకు ఇది గర్వకారణమని పేర్కొన్నారు.

Leave a Reply