మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి వినతి పత్రం..

మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి వినతి పత్రం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే అధికారులతో చర్చించి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసే విధంగా ప్రత్యేక కృషి చేస్తానని రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Dr. Vakiti Srihari) హామీ ఇచ్చారు. దక్షిణ మధ్య రైల్వే నూతనంగా ఏర్పాటు చేసే వికారాబాద్- కృష్ణ రైల్వే లైన్ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.
ఈ రోజు హైదరాబాద్ సచివాలయంలో ఊట్కూర్ రైల్వే సాధన సమితి నాయకులు మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఊట్కూర్ మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు పై అఖిలపక్షం నాయకులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వెంటనే స్పందించి రైల్వే శాఖ జిఎంతో మాట్లాడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే నూతనంగా ఏర్పాటు చేసే లైన్ పాత డిపిఆర్ ప్రకారం చేపట్టే విధంగా చూస్తానని భరోసానిచ్చారు. గతంలో రైల్వే శాఖ ఊట్కూర్ మండల కేంద్రంలో రైల్వే స్టేషన్(Railway Station) ఏర్పాటు చేసేందుకు డి పీ ఆర్ లో ఉన్న విషయం తనకు అవగాహన స్పష్టంగా ఉందన్నారు.
రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసం శక్తివంచన లేకుండా కృషి చేయడంతో పాటు అవసరమైతే ఢిల్లీకి సంబంధిత మంత్రులతో కలిసి ఒప్పిస్తానని అన్నారు. అనంతరం అఖిలపక్షం నాయకులు ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం సమర్పిస్తున్నట్లు విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్, సూర్య ప్రకాశ్ రెడ్డి, అరవింద్ కుమార్, యజ్ఞేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, హన్మంతు, కృష్ణయ్య, శంకర్,వెంకటేష్, లింగం, రాఘవేందర్ గౌడ్, రవికుమార్, అశోక్, దత్తు, భీమకవి తదితరులు పాల్గొన్నారు.
