ఢిల్లీ : సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ముందస్తు బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. బుధవారం విచారించిన ధర్మాసనం.. మైనింగ్ వాల్యూయేషన్ (Mining Valuation) పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని తెలిపింది. సీల్డ్ కవర్‌లో కోర్టుకు నివేదిక ఇవ్వాలని ధర్మాసనం కోరింది.
తమ వాదన వినకుండా బెయిల్ ఇచ్చారని ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా (Siddharth Luthra) సుప్రీంకోర్టుకు తెలిపారు. రూ.195 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందని న్యాయవాది గుర్తుచేశారు. సీల్డ్ కవర్‌లో నివేదిక ఇస్తామని న్యాయవాది నివేదించారు. దీంతో తదుపరి విచారణ ఈనెల 16కు న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే వల్లభనేని వంశీ బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. వివిధ కేసుల్లో ఆయన 138 రోజులుగా విజయవాడ సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అన్ని కేసుల్లో ఇప్పటికే ఆయనకు బెయిల్ లభించింది. చివరిగా మంగళవారం నకిలీ పట్టాల కేసు (Fake land title case) లో కూడా నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. దీంతో బుధవారం వంశీ జైలు నుంచి విడుదలవుతారని ఆయన తరపు న్యాయవాదులు వెల్లడించారు. ఇక ఆయనకు స్వాగతం పలికేందుకు అభిమానులు, కార్యకర్తలు జైలుకు తరలిరానున్నట్లు తెలుస్తోంది.