కేసు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. బండి సంజయ్ పై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ప్రచారం వేళ బండి సంజయ్ పై కేసు నమోదైంది. కార్యకర్తల భేటీలో భాగంగా బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి, ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు.
అయితే దీనిపై గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో కేంద్ర మంత్రి తరపు న్యాయవాది మాట్లాడుతూ.. బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని, ఆధారాలు లేకుండానే బండి సంజయ్ పై అభియోగం మోపి కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. దీంతో ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్న కారణంతో కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.