గ్రామసభలో శాఖల నివేదికల వినిపింపు…

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని 12 గ్రామపంచాయతీలలో సర్పంచులు, ఉపసర్పంచులు, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామసభలు నిర్వహించబడినట్లు ఎంపీడీవో ధీరావత్ శ్రీను, ఎమ్మార్వో జగదీశ్వర ప్రసాద్ తెలిపారు.
స్థానిక సర్పంచ్ వాసం సుస్మిత, కార్యదర్శి వల్లాల శిరీష అధ్యక్షతన గ్రామసభ నిర్వహించబడింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలు, జిల్లా కలెక్టర్ అంకిత్ సూచనల మేరకు ఈ గ్రామసభలను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు.
ఈ గ్రామసభలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలైన కల్యాణలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, వడ్డీలేని రుణాలు, మహాలక్ష్మి పథకం, రైతుబీమా, ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పింఛన్లు తదితర పథకాల గురించి లబ్ధిదారులకు విపులంగా వివరించారు.
అదేవిధంగా, ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలు సేకరించి నమోదు చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలు మరియు ఇతర అభివృద్ధి పనులను ప్రజలకు స్పష్టంగా వివరించారు. భవిష్యత్తులో చేపట్టవలసిన కొత్త అభివృద్ధి పనులను కూడా గ్రామసభలో గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సయ్యద్ ఆరిఫ్, ఎంపీఓ ఫణీంద్రకుమార్, ఎంఈఓ శాంతారావు, ఆశా వర్కర్లు, అంగన్వాడి సిబ్బంది, మెడికల్, రెవెన్యూ, ఆర్టీసీ, వ్యవసాయ, విద్యుత్, వెటర్నరీ శాఖల సిబ్బంది, స్థానిక ఎస్ఐ సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
