Registrar | రిజిస్ట్రార్ తొలగింపునకు విద్యార్థి సంఘాల ముట్టడి….

Registrar | రిజిస్ట్రార్ తొలగింపునకు విద్యార్థి సంఘాల ముట్టడి….

కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు…
పరిపాలన భవనం దద్దరిల్లిన నినాదాలు…
తొలగించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్న హెచ్చరిక…

Registrar | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ రిజిస్ట్రార్‌ను తక్షణమే పదవి నుండి తొలగించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఎ, పీడీఎస్‌యూ, ఆర్‌పీఎస్‌ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిపాలన భవనాన్ని ముట్టడించి, రిజిస్ట్రార్ తొలగింపునకు గట్టి నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్, ఏఐఎస్ఎ రాష్ట్ర కార్యదర్శి ఎస్.నాగార్జున, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.శరత్ కుమార్, ఆర్‌పీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ యూనివర్సిటీని కొంతమంది అధికారులు అవినీతి అడ్డాగా మార్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు పూర్తిగా వినియోగించకుండా, వాటిని దుర్వినియోగం చేసి కోట్ల రూపాయలు కాజేసినట్లు విమర్శించారు.

Registrar |

యూనివర్సిటీ పరిధిలో ఫీజులను పెంచి విద్యార్థులపై ఆర్థిక భారం మోపుతున్నారని, టెండర్ల కేటాయింపులో పారదర్శకత లేకుండా అనుకూల వ్యక్తులకు కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆరోపించారు. కమిటీలు కూడా రిజిస్ట్రార్ సిఫారసుల మేరకే ఏర్పాటు అవుతున్నాయని, కీలక నిర్ణయాల్లో ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ వ్యవహారంపై వీసీకి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కాన్వకేషన్ వరకు కొనసాగించి అనంతరం కొత్త రిజిస్ట్రార్ నియమిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని ప్రశ్నించారు.

Registrar |

ప్రస్తుత రిజిస్ట్రార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యూనివర్సిటీ నిత్యం వివాదాల కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, వీసీ తక్షణమే స్పందించి రిజిస్ట్రార్‌ను తొలగించాలని, లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి దశల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ నాయకులు హరీష్, రాజు, ఈశ్వర్, ఏఐఎస్ఎ నాయకుడు రాము, ఆర్‌పీఎస్‌ఎఫ్ నాయకుడు బాలాజీతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Registrar |

Leave a Reply