నంద్యాల బ్యూరో, జులై 15 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం (Srisailam) జల విద్యుత్ ప్రాజెక్టుకు వరదనీరు తగ్గుముఖం పట్టడంతో మంగళవారం నీరు కిందకు వదిలే రేడియల్ గేట్లను జలవనరుల శాఖ అధికారులు పూర్తిగా మూసివేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గత వారం రోజుల క్రితం శ్రీశైలంకు వచ్చి గంగమ్మ హారతి చేపట్టి నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి సాగర్ కు నీరు విడుదల చేశారు.
ఎగువ ప్రాంతమైన కర్ణాటక (Karnataka), మహారాష్ట్ర (Maharashtra) లో వర్షాలు పడకపోవడం, అక్కడి ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కాకపోవటంతో వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లను పూర్తిగా బంద్ చేశారు. శ్రీశైలంలో ప్రాజెక్టు నీటిమట్టం 885అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 882.40 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం నీటిమట్టం సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.1205 టీఎంసీలుగా నీటి నిలువలున్నాయి. శ్రీశైలంలోకి ఎగువ ప్రాంతాల నుంచి 55,387 క్యూసెక్కుల నీరు వస్తూ ఉంది. జూరాల నుంచి26,939 క్యూసెక్కులు వస్తున్నాయి. సుంకేసుల జలాశయం నుంచి 28,448 క్యూసెక్కుల నీరు వస్తోంది.
విద్యుత్ ఉత్పత్తికి ఎడాపెడా నీరు విడుదల…
శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టినప్పటికీ అధికారులు విద్యుత్ ఉత్పత్తికి ఎడాపెడా నీరు వదలటం విశేషం. విద్యుత్ ఉత్పత్తికి మంగళవారం 68,930 క్యూసెక్కుల నీటిని ఉపయోగించారు. ఆంధ్రప్రదేశ్ జల విద్యుత్ ఉత్పత్తికి 33,615 క్యూసెక్కుల ద్వారా 32.43 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణ జల విద్యుత్ కోసం 35,315 క్యూసెక్కుల నీటిని ఉపయోగించి 37.26 మిలియన్ల యూనిట్ ను ఉత్పత్తి చేస్తున్నారు. జలాశయం నుంచి నీటిని విడుదల చేయటంతో రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీప్ సీజన్ లో పంటలు పండించేందుకు రాయలసీమ రైతాంగం ప్రాజెక్టులపైన ఆధారపడి ఉందని పేర్కొంటున్నారు.