KNL | రూ.1.30 కోట్ల సెల్ ఫోన్ల‌ రికవరీ..

కర్నూలు బ్యూరో, జూన్ 12, ఆంధ్రప్రభ : కర్నూలు సైబర్ ల్యాబ్ పోలీసులు రికవరీ చేసిన 604 మొబైల్ ఫోన్లను గురువారం కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా బాధితులకు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మొబైల్ రికవరీ (Mobile Recovery) మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా (Hussein Peera) మీడియాతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు పోలీసులు రెండవ విడతలో 604 (విలువ రూ.1 కోటి 30 లక్షలు) మొబైల్ ఫోన్లను రికవరీ చేశారన్నారు. ప్రజలు మొబైల్స్ పొగోట్టుకోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.

తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాల ఓటిపిలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదని, సైబర్ నేరాల (Cyber ​​crimes) బారిన‌ పడకుండా ఉండాలన్నారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి రికవరీ చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క పోలీసును, ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పోలీసులను అభినందిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉందన్నారు. మొబైల్ లో మనకు సంబంధించిన పర్సనల్ వివరాలు, ఫోన్ నెంబర్లు, వ్యాపార లావాదేవిలు, అటాచ్ మెంట్స్, సెంటిమెంట్స్, ఆన్ లైన్ బ్యాంకు ఖాతా వ్యవహరాలు ఇలా చాలా మిస్ అవుతూ ఉంటారన్నారు.

ఎవరైనా మొబైల్ పోగోట్టుకుంటే వెంటనే కర్నూలు పోలీసు వెబ్ సైట్ లో http://Kurnoolpolice.in/mobiletheft కు వెళ్ళి పోగొట్టుకున్న మొబైల్ ఐఎంఈ (Mobile IME) వివరాలు తెలియజేస్తే సెల్ పోన్ రికవరీ చేసేందుకు కర్నూలు పోలీసులు కృషి చేస్తారన్నారు. ఈ పోలీసు సేవకు ఎలాంటి రుసుము ఉండదు, ఉచితం అని, మొబైల్ పోయిన తర్వాత బాధపడడం కంటే ఆ మొబైల్ ఫోన్ పోగొట్టుకోకుండా జాగ్రత్తలు పాటించడం మంచిదని అడిషనల్ అడ్మిన్ హుస్సేన్ తెలిపారు. సెల్ ఫోన్ పొగోట్టుకున్న బాధితులకు మొబైల్స్ రికవరీ చేసి ఇచ్చినందుకు జిల్లా ఎస్పీకి, అడిషనల్ ఎస్పీకి, సైబర్ ల్యాబ్ పోలీసులకు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూల్ ఇంచార్జి డిఎస్పి శ్రీనివాసాచారి, సిఐలు అబ్దుల్ గౌస్, నాగరాజరావు, రామయ్యనాయుడు, సైబర్ ల్యాబ్ సిఐ వేణుగోపాల్, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం పాల్గొన్నారు.

Leave a Reply