- స్వల్ప టార్గెట్ తో బరిలోకి అక్షర్ సేన
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు జరుగుతున్న థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు చెలరేగారు. ఢిల్లీ బౌలర్ల ధాటికి బెంగళూరు బ్యాటర్లు చేతులెత్తేశారు. కాగా, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. తమ బౌలింగ్ నైపుణ్యాన్ని నిరూపించుకుంది.
ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఆర్సీబీ 163/7 పరుగులకే పరిమితమైంది. తమ సొంత మైదానంలో దుమ్మురేపాలని రంకెలేసిన బెంగళూరుకు ఢిల్లీ జట్టు కళ్లెం వేసింది. స్పిన్నర్లు విప్రాజ్ నిగ్గమ్ (2/18), కుల్దీప్ యాదవ్ (2/17) తలా రెండు వికెట్లు తీసి ఆర్సీబిని దెబ్బతీశారు. ఇక ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ ఒక్కో వికట్ దక్కించుకున్నారు.
ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఉగ్రరూపంతో విరుచుకుపడ్డాడు. 17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 37 పరుగులు దంచేశాడు సాల్ట్. అయితే, ఢిల్లీ బౌలర్లను బాదేస్తున్న ఫిలిప్ సాల్ట్.. 3.5 ఓవర్లలో రన్ ఔట్ అయ్యాడు. ఇక అప్పటి నుండి, ఢిల్లీదే పైచేయిగా కొనసాగింది.
ఫిలిప్ సాల్ట్ ఔటయ్యే సమయానికి ఆర్సీబీ స్కోర్ 3.5 ఓవర్లలో 61/1 కాగా.. 9.3 ఓవర్లకు మరో 30 పరుగులు చేసి 91 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది బెంగళూరు. విరాట్ కోహ్లీ (22), కెప్టెన్ రజత్ పాటీదర్ (25), కృణాల్ పాండ్యా (18) పరుగులు సాధించగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్ (37) బౌండరీలు బాదడంతో బెంగళూరు స్కోరు బోర్డు కొద్దిగా మెరుగుపడింది.
ఇక 164 పరుగుల మోస్తరు లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఛేజింగ్ కు దిగనుంది.