AP| రాయలసీమకూ రాజధాని.. చింతా మోహన్

ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయడం ఆమోదయోగ్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ డిమాండ్ చేశారు. అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు కావడం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. సంపదంతా అమరావతిపై వినియోగిస్తే మిగిలిన జిల్లాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే అమరావతి అభివృద్ధికి రూ.60వేల కోట్లు ఖర్చు చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ప్రణాళికలు రచిస్తుందన్నారు.

అయితే కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇచ్చినంత మాత్రాన రాయలసీమ అభివృద్ధి సాధ్యం కాదని, రాయలసీమకు రాజధాని అనే డిమాండ్ ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతుందన్నారు. రాయలసీమ బిడ్డగా చంద్రబాబు ఈ అంశాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. కార్పొరేట్ సెక్టార్ అంతా అమరావతిలో కేంద్రీకృతమైతే వెనుకబడిన రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. గుంటూరులోని ఓ ప్రైవేటు హోటల్లో శుక్రవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు.

వర్గీకరణను వ్యతిరేకిస్తున్నా…
ఎస్సీ వర్గీకరణను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చింతామోహన్ తెలిపారు. చంద్రబాబు వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. వర్గీకరణ అనేది ఉద్యోగాలకు పరిమితం చేయకూడదని, బ్యాంకులు, కాంట్రాక్ట్ సెక్టార్లో రిజర్వేషన్ కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వర్గాలు ఆర్థికంగా నిలబడతాయన్నారు. అలాగే పేదల కోసం జాతీయం చేసిన బ్యాంకులు నేడు సంపన్న వర్గాలకు వరంగా మారాయని, బ్యాంకుల్లో ఆయా వర్గాలకు రుణాలు మంజూరు చేసే అంశంలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరుతో బ్యాంకులు ఎగవేతదారులకు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్పొరేట్ సెక్టార్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ బ్యాంకింగ్ సెక్టార్ ను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పటికైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని బ్యాంకింగ్ తో పాటు అన్ని సెక్టార్లలో అమలు చేయాలని చింతా మోహన్ సూచించారు.

కాంగ్రెస్ బలోపేతం..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుందని చింత మోహన్ చెప్పారు. కూటమి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత వస్తుందన్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. ఆయన ఒక్కసారి ఇవ్వమని అడిగారని ప్రజలు ఇచ్చారని ఇక రెండోసారి ఇవ్వరని చమత్కరించారు. దేశవ్యాప్తంగా ఈవీఎంల మాయాజాలం కారణంగానే రెండుసార్లు బీజేపీ అధికారం చేపట్టిందన్నారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ వస్తే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *