Rathasaptami Celebrations | సప్త వాహనాలపై భక్తులకు శ్రీవారి దర్శనం
తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్బంగా మంగళవారం సప్త వాహనాలపై కోనేటిరాయుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.సప్త వాహనాలపై భక్తులకు దర్శనం..
రధసప్తమి సందర్బంగా మంగళవారం శ్రీనివాసుడు సప్త వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్య ప్రభ వాహనం పై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 9 నుంచి 10 గంటల వరకు గోవిందుడు.. చిన్న శేష వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.
11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనంపై తిరు వీధుల్లో కోనేటిరాయుడు ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. శ్రీనివాసుడు.. మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు.. 2 నుండి 3 గంటల వరకు శ్రీవారి వరాహ పుష్కరిణిలో చక్రస్నానం..
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులను కటాక్షించునున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం పై భక్తులకు దర్శనం.. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి జరిగే చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగియనున్నాయి.
వాహనసేవలను తిలకించెందుకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలలో వేచి వుండే భక్తులు ఇబ్బందులు పడకుండా తిరు వీధుల్లోని గ్యాలరీల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. గ్యాలరీల్లో నిరంతరాయంగా భక్తులకు అన్నపానీయాల సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్యాలరీల్లోకి చేరుకోలేని భక్తులు.. వాహనసేవలను తిలకించేందుకు తిరుమాడ వీధులకు వెలుపల అధికారులు ఎల్‌ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.రథసప్తమి వేడుకల నేపథ్యంలో తిరుమలలో పోలీస్ అధికారులు 2,250 మంది భద్రతా సిబ్బందితో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులకు విధులు కేటాయించారు.