Rally | హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి..

Rally | హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి..
- అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పడేల్
Rally | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రహదారి నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పడేల్ సూచించారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా చిత్తూరు ఆర్‌టీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. “శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన” అనే నినాదంతో ప్రారంభమైన ఈ ర్యాలీ మహాత్మా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ… జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయాన్ని తగ్గించుకోవచ్చని, ప్రమాదాలు ఎప్పుడైనా సంభవించే అవకాశముందని నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు.

హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల నుంచి రక్షణ మాత్రమే కాకుండా కాలుష్య ప్రభావం నుంచి కూడా యువత, మహిళలకు కొంత రక్షణ లభిస్తుందని ఒక సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, మునిసిపల్, వైద్య ఆరోగ్య శాఖ, జాతీయ రహదారుల శాఖ అధికారులు సమన్వయంతో రహదారి భద్రత కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ నెలంతా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మోటార్ వాహన నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారి డ్రైవింగ్ లైసెన్సులను మూడు నెలల పాటు విధిగా రద్దు చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలో ఇప్పటివరకు 370 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, వాటిలో 160 ద్విచక్ర వాహన ప్రమాదాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే జరిగాయని తెలిపారు. రహదారి భద్రత మనందరి బాధ్యత అని పేర్కొన్న ఆయన, చిత్తూరు జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టీఓ సునీల్ కుమార్, ఎంవీఐలు నరసింహులు, రాజేశ్వర్ రావు, మురళి, వివిధ ఎన్‌జీవోలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
