Rajya Sabha | ప‌హల్గామ్ ఉగ్ర‌దాడి ఇంటెలిజెన్స్ వైఫ‌ల్య‌మే – రాజ్య‌స‌భ‌లో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన‌ ఖ‌ర్గే

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ‌:
భారత్-పాకిస్తాన్ సంఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన శాంతి ఒప్పందం వాదనలపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెహల్గామ్ దాడి గురించి మాట్లాడుతూ.. ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడి జరిగి నెలలు గడిచినా, ఆ ఉగ్రవాదులను ఇప్పటి వరకు పట్టుకోలేదు, వారి గురించి సమాచారం కూడా లేదన్నారు. నేడు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభలలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై కీలక ప్రశ్నలు వేశారు.

అన్ని పార్టీలు అండ‌గా …

త‌మ‌ పార్టీ మాత్రమే కాదని,, అన్ని పార్టీలు దేశాన్ని బలోపేతం చేయడానికి, సైన్యానికి ధైర్యం నింపడానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కానీ, ఇప్పుడు అసలు పెహల్గామ్ దాడి జరిగిన దాని గురించి స్పష్టమైన సమాచారం కావాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ విషయంలో లోపం జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు. ఆ క్రమంలో ఆపరేషన్ సిందూర్ గురించి ప్రభుత్వం ప్రపంచానికి, భారత ప్రజలకు చెప్పింది. కానీ, ఆ తర్వాత ఏమైంది, ఏం జరిగిందో సమాచారం ఇవ్వాలని ఖర్గే కోరారు.

ట్రంప మాట‌లు సంగ‌తేంటి..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని 24 సార్లు పేర్కొన్నారని ఖర్గే గుర్తు చేశారు. ట్రంప్ ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నారు? శాంతి ఒప్పందం జరిగిందా? ఒకవేళ జరిగితే, దాని వివరాలు ఏంటి? ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు. దేశ ప్రజలకు, పార్లమెంటుకు సమాచారం అందించడం ప్రభుత్వం బాధ్యత అని ఈ సందర్భంగా ఖర్గే గుర్తు చేశారు. ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను పట్టుకోవడంలో జాప్యం జరగడం, ఇంటెలిజెన్స్ వైఫల్యం గురించి ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. మన సైన్యం ధైర్యంగా పోరాడుతోంది. కానీ, ఇటువంటి సంఘటనలు మన భద్రతా వ్యవస్థలోని లోపాలను బయటపెడుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

చర్చకు సిద్ధమైన ప్రభుత్వం

విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ప్రభుత్వం మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని, అన్ని వివరాలనూ దేశ ప్రజలకు తెలియజేస్తామని బీజేపీ నేత, రాజ్యసభలో లీడర్ ఆఫ్ ది హౌస్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. దానిపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ కూడా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

Leave a Reply