POLICE | రైళ్లలో ఫోన్లు దొంగలు అరెస్ట్…

POLICE | రైళ్లలో ఫోన్లు దొంగలు అరెస్ట్…
6లక్షల విలువ గల 26 సెల్ ఫోన్లు స్వాధీనం..
కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ : రైళ్ల లో ప్రయాణికుల సెల్ ఫోన్లు చోరికి పాల్పడే దొంగలను ఆర్ పి ఎఫ్, జి ఆర్ పి పోలీసులు కలసి చాకచక్యంగా పట్టుకున్నారు. మంగళవారం విజయవాడ రైల్వే ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం లో రైల్వే డిఎస్పీ జి రత్న రాజు ( Railway DSP G Ratnaraju) చోరి వివరాలు వెల్లడించారు. పోలీసులు కధనం ప్రకారం. అనంతపురం నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు బండిలో ప్రయాణం చేస్తున్నా వేర్వేరు వ్యక్తుల సెల్ ఫోన్లు దొంగలించినట్లు ఈనెల 13వ తేదీన గుడివాడ జి ఆర్ పి స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ క్రమంలో గుడివాడ మచిలీపట్నం రైల్వే స్టేషన్ల పరిధిలో జరుగుతున్న మొబైల్ ఫోన్ దొంగతనాలపై ఆర్ పి ఎఫ్, జి ఆర్ పి అధికారులు ఆదేశాలతో బృందాలుగా ఏర్పడి గుడివాడ స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాల (CCTV Cameras) పరిశీలన ఆధారంగా ఖచ్చితమైన సమాచారం సేకరించి మంగళవారం ఉదయం గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ సమీ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న రిజర్వేషన్ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.
వారిద్దరిని విచారించగా తెనాలిలోని చిన్న రావూరు వీధికి చెందిన షేక్ కరీముల్లా (Sheikh Karimullah) (ఎ1) ధర్మవరం రైలు బండిలో బెడ్ రోలర్ గా చేస్తుండగా, అతని స్నేహితుడు అనంతపురానికి చెందిన ఆదోని చిన్నప్ప(ఎ2) తో కలిసి రైళ్లలో ప్రయాణికుల మొబైల్ ఫోన్లను దొంగిలిస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఇద్దరి నుంచి సుమారు లక్షా35వేల రూపాయల విలువ చేసే ఒక ఐఫోన్, రెండు వివో ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో వివిధ శాస్త్రీయ కోణాల ద్వారా మరోక 23 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది .
వాటి విలువసుమారు నాలుగులక్షల 70 వేల రూపాయలు. వారి ఇద్దరి నుంచి సుమారు 6లక్షల విలువ గల మొత్తం 26 మొబైల్ ఫోన్ (Mobile Phone) లను స్వాధీనం చేసుకున్నట్లు రత్నరాజు తెలియజేశారు. రైళ్లలో మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేయడంలో ఆర్పిఎఫ్ అసిస్టెంట్ స్టేషన్ కమాండర్ పొన్ను స్వామి పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వి దుర్గారావు, గుడివాడ ఆర్ పి ఎస్ ఐ ఎం షరీఫ్, ఆర్ పి ఎఫ్ సిఐబి కె మధుసూదన్, ఆర్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్లు ఫతే అలీబేగ్, పి రామకృష్ణ ఏఎస్ఐ ఎస్ కె అక్బర్ వారి సిబ్బందితో బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించారని రైల్వే డిఎస్పి జి రత్నరాజు పేర్కొన్నారు.
