Telangana | ర్యాగింగ్ చేస్తే జైలుకే..!
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత
Telangana | గోదావరిఖని, ఆంధ్రప్రభ : ర్యాగింగ్ నేరం… ఏ రూపంలోనైనా ర్యాగింగ్ కి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ (Amber Kishore) హెచ్చరించారు. ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ గోదావరిఖనిలోని సింగరేణి మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ర్యాగింగ్ వల్ల తీసుకొనే చట్టపరమైన చర్యలు, శిక్షలు, ర్యాగింగ్ కి పాల్పడడం వల్ల కలిగే వ్యక్తిగత హానికర పరిణామాల గురించి, అలాగే పోలీస్ హెల్ప్‌లైన్ సేవల గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ (Amber Kishore) మాట్లాడుతూ… ఎవరైనా ర్యాగింగ్‌కు గురైతే ఆత్మస్థైర్యం కోల్పోవడం, తరగతులకు రాకుండా భయపడడం, మానసికంగా కృంగిపోకుండా వెంటనే పోలీసులకు/యాంటీ ర్యాగింగ్ కమిటీకి సమాచారం ఇవ్వాలి అని సూచించారు. గంజాయి, డ్రగ్స్ (Marijuana, drugs) లాంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దని సూచించారు. క్యాంపస్ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉందని, క్యాంపస్ చుట్టూ నిత్యం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
సైబర్ నేరాల (Cyber crimes) పెరుగుతున్న నేపథ్యంలో అకౌంట్ హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింక్స్, ఫిషింగ్ వంటి ఘటనలపై జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి నాగేంద్ర గౌడ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్ , గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ప్రొఫెసర్ లు, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.

