పూలు అమ్మే మహిళలపై పోలీసుల మానవత్వం…

పూలు అమ్మే మహిళలపై పోలీసుల మానవత్వం…

మైలవరం మండలంలోని జాతీయ రహదారిపై పూలు విక్రయించే మహిళలకు రేడియం జాకెట్లు పంపిణీ..
రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేందుకు భద్రతా చర్యలు..
మల్లె సీజన్‌లో హైవేపై పూలు అమ్మే మహిళలకు ప్రత్యేక రక్షణ చర్యలు..
రూరల్ డిసిపి లక్ష్మీ నారాయణ చేతుల మీదుగా సుమారు 20 మంది మహిళలకు రేడియం జాకెట్లు అందజేత..

ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రభ : జాతీయ రహదారిపై జీవనాధారంగా పూలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మహిళల భద్రతపై మైలవరం పోలీసులు మానవత్వంతో ముందుకొచ్చారు. రాత్రి వేళల్లో హైవేపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో మహిళలు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు రేడియం జాకెట్లు పంపిణీ చేసి వారి భద్రతకు చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా ఈ జాకెట్లు ఉపయోగపడతాయని, వాటిని తప్పనిసరిగా ధరించాలని సూచిస్తూ మహిళల్లో అవగాహన కల్పించారు. పూల అమ్మకాలతో జీవనం సాగిస్తున్న మహిళల రక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదాలకు గురవుతున్న పూలు అమ్ముకునే మహిళలు..

మైలవరం పరిధిలోని జాతీయ రహదారి వద్ద మల్లెపూలతో పాటు వివిధ రకాల పూల తోటలు విస్తరించి ఉండటంతో అనేక మంది మహిళలు రహదారి పక్కనే పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే హైవేపై వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని మైలవరం సీఐ కిషోర్ బాబు రూరల్ డిసిపి లక్ష్మీ నారాయణ చేతుల మీదగా రేడియం జాకెట్లు అందజేసి, రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా అవి ధరించాలని సూచించారు. ఈ చర్యతో మహిళల్లో భద్రతా భావం పెరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

పోలీసుల చర్యపై మహిళలు ఆనందం..

హైవే పక్కన ఎన్నో ఏళ్లుగా పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మహిళల భద్రత గురించి ఇప్పటివరకు పెద్దగా ఎవరూ ఆలోచించని పరిస్థితుల్లో, తమ ప్రాణరక్షణ కోసం తీసుకున్న ఈ చర్యపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా రేడియం జాకెట్లు అందించడం వల్ల ప్రమాదాల భయం కొంతవరకు తగ్గుతుందని పేర్కొంటూ, తమ భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ చర్యపై మహిళలు కృతజ్ఞతాభావం వ్యక్తం చేస్తున్నారు.

భద్రతపై సీఐ కిషోర్ బాబు దూర దృష్టి…

ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కన్నా, ముందుగానే ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో దూరదృష్టితో వ్యవహరిస్తున్న పోలీసు అధికారి కిషోర్ బాబు. ఎక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు చేపట్టడంలో ఆయన ప్రత్యేకత కనిపిస్తోంది. గతంలో విజయవాడ త్రీటౌన్ ట్రాఫిక్ పరిధిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు ప్రజల ప్రశంసలు అందుకోగా, అదే దృక్పథంతో మైలవరం పరిధిలో కూడా హైవే ప్రమాదాల నివారణకు పలు చర్యలు చేపడుతున్నారు. రాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తూ తనదైన విధానంతో బాధ్యతాయుతంగా సేవలందిస్తున్నారు. ఈ చర్యలను స్థానికులు, ప్రజలు పలువురు అభినందిస్తున్నారు.

Leave a Reply