ఉగాది పండుగ సందర్భంగా ఆకాశవాణిలో ‘అష్టావధానం’

ఉగాది పండుగ సందర్భంగా ఆకాశవాణిలో ‘అష్టావధానం’
విజయవాడ, ఆంధ్రప్రభ : సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడం లో ఆకాశవాణి ముందు వరుసలో ఉంటుందని ఆకాశవాణి విజయవాడ కేంద్రం డిడిజి, కార్యాలయం అధిపతి ఎం. సోమేశ్వర రావు అన్నారు. ‘శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ’ సందర్భంగా, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రముఖ ద్విశతావధాని డాక్టర్ బులుసు అపర్ణ తో ప్రత్యేక “అష్టావధానం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంచాలకులు గా డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్, పృచ్ఛకులు డాక్టర్ పాలపర్తి శ్యామలనంద ప్రసాద్(నిషిద్ధ అక్షరం), డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ (సమస్య), వాడవల్లి కృష్ణ కుమారి(దత్తపది), డాక్టర్ గుడిసేవ విష్ణు ప్రసాద్ (వర్ణన), డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (అప్రస్తుత ప్రసంగం), పూసడపు సుబ్బారావు(ఆశువు), పులుపుల వేంకట ఫణి కుమార శర్మ(వార గణనం), డాక్టర్ కోగంటి వేంకట రంగనాయకి(వ్యస్తక్షరి) అంశాలతో అవధాని పై ప్రశ్నలు సంధించారు.
అవధాని డాక్టర్ బులుసు అపర్ణ అవలీలగా, చమత్కారంగా పద్యాలను పూరించారు. ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ అష్టావధాన కార్యక్రమం ప్రొగ్రాం ఎగ్జిక్యూటివ్ డాక్టర్ చుండూరు మాణిక్య రావు నిర్వహణలో జరిగింది. ఈ కార్యక్రమం ఉగాది పండుగ రోజున గురువారం ఉదయం 09:30 గం లకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, మరలా ఉదయం 10:30 గం లకు ఆకాశవాణి ఏ్ఫమ్ రెయిన్బో 102.2 పై ప్రసారం అవుతుందని ప్రొగ్రాం హెడ్ గుడిపూడి దివ్య తెలియజేశారు. 59 నిమిషాల వ్యవధి గల అష్టావధానం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆకాశవాణి కేంద్రాలు వివిధ సమయాల్లో ప్రసారం చేస్తాయని ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ పి. ప్రశాంత్ కిరణ్ తెలిపారు.
