వైద్య కళాశాల నిర్మాణం పీపీపీ పద్ధతిలో… రాజధాని నిర్మాణం ప్రభుత్వమే ఎందుకలా?
బాపట్ల వైఎస్సార్సీపీ సమన్వయకర్త కోన రఘుపతి
బాపట్ల టౌన్ అక్టోబర్ 24 ఆంధ్రప్రభ : నిరుపేదలకు విద్య వైద్యం కార్పొరేట్ స్థాయిలో అందించే 17 ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం పీపీపీ పద్ధతితో ప్రైవేటీకరణ, రాష్ట్ర రాజధాని నిర్మాణం ప్రభుత్వమే చేపట్టడం ఏమిటని బాపట్ల వైఎస్సార్సీపీ సమన్వయకర్త కోన రఘుపతి ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక రథం బజార్ సెంటర్లో గల నియోజకవర్గ కార్యాలయంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 28న ప్రజా ఉద్యమానికి కోన రఘుపతి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రజా ఉద్యమం పోస్టర్‌ను వైయస్సార్సీపీ నియోజకవర్గ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ వైద్య కళాశాలలు ప్రభుత్వమే నిర్మిస్తే పేద విద్యార్థులకు ఉచిత విద్య లభించి డాక్టర్లుగా ప్రజలకు సేవలు అందిస్తారని తెలిపారు. కళాశాల ఏర్పాటుతో నర్సింగ్ కళాశాల పారామెడికల్ కళాశాల కార్పొరేట్ వైద్యం వంటి సౌకర్యాలు వస్తాయన్నారు. తద్వారా విద్యతోపాటు అనేకమంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగం మెరుగుపడుతుందన్నారు. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ పీపీపీ విధానంతో చంద్రబాబు నాయుడు తన బినామీలకు లబ్ధి చేకూర్చడానికే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతున్నారన్నారని తెలిపారు.
పేద విద్యార్థులు అందరూ డాక్టర్లుగా కావాలనే సదుద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో భారీ సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను యథా విధంగా ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చేజెర్ల నారాయణరెడ్డి, కోకి రాఘవరెడ్డి, కాగిత సుధీర్ బాబు, మరుప్రోలు ఏడుకొండలు రెడ్డి, కోనపు రెడ్డి అవినాష్ నాయుడు, జోగి రాజా, తన్నీరు అంకమ్మరావు, సి.కే నాయుడు పాల్గొన్నారు.

