హైదరాబాద్ – బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రేపు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల హననం గురించి.. అప్రజాస్వామికమైన పోకడల గురించి నిరసన తెలిపేందుకు రచించిన అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చాం. ఇక్కడికి వచ్చి చూస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం వద్దకు వెళ్లి కూర్చునేందుకు అవకాశం లేకుండా గేట్లు మూసేశారు. ఆ మహానుభావుడిని సంకెళ్లతో బంధించిన నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా.. పేరుకేమో ప్రజాపాలన.. చేసేవన్నీ అప్రజాస్వామిక పనులు అన్నట్లుగా ఉంది’ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాగ్ధానాల భంగంపై విమర్శల దాడి చేస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేక జగదీశ్‌రెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
మా గొంతు నొక్కారు..
‘అవసరమైతే అన్ని స్పీకర్ చాంబర్‌లో ఒక సమావేశం పెట్టి ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏదైనా మాట దొర్లిందని మీరు భావిస్తే మా సభ్యులు హుందాగా ముందుకు వచ్చి విచారం వ్యక్తం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మేం తప్పు చేయలేదు. ఒక్క పొల్లుమాట మాట్లాడలేదు. అయినా సరే.. స్పీకర్‌పై ఉండే గౌరవంతో.. ఆ పదవిపై ఉండే గౌరవంతో మేం అవసరమైతే విచారం వ్యక్తం చేసి.. సభ సజావుగా జరిగేందుకు సహకరిస్తామని స్పీకర్, మంత్రికి చెప్పాం. కానీ, చేయని తప్పుకు మొత్తం సెషన్ అంతా జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. హరీశ్‌రావు రిపీటెడ్‌గా అడుగుతున్నారు. మా పార్టీ తరఫున మా వాదన చెప్పనివ్వాలని.. చెప్పేది వినండి అన్నా వినకుండా.. కాంగ్రెస్ పార్టీ సభ్యులు నలుగైదుగురితో మాట్లాడించారు. వారు చెప్పిందే వేదమని.. చెప్పిందే సత్యం అన్నట్లు బుల్డోజ్ ధోరణితో.. నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయం తీసుకొని మా సభ్యుడి గొంతునొక్కారు’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.