పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

  • సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సెక్షన్) అమలు
  • పదవ తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట బందోబస్తు
  • జిరాక్స్ సెంటర్స్ మూసివేత
  • ఈనెల 14 నుండి ఏప్రిల్ 16 వరకు నిషేధాజ్ఞలు అమలు
  • సభలు,సమావేశాలు,ర్యాలీ లు,ధర్నాలు నిషేధం
  • సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత

వరంగల్, ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షలు సాఫీగా సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతి భద్రతల రక్షణ లో భాగంగా సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.


వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 150 పరీక్ష కేంద్రాల్లో( హన్మకొండ 64, వరంగల్ 47, జనగామ 39) శనివారం నుండి ఏప్రిల్ 16 వరకు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పరీక్షలు నిర్వహించ నున్నారన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని డీసీపీ ధార కవిత స్పష్టం చేశారు.

పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడి ఉండరాదన్నారు.ఎగ్జామ్ సెంటర్స్ సమీపంలో సభలు, సమావేశాలు,ర్యాలీ లు, ధర్నాలు నిర్వహించడం నిషేధమన్నారు.పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు శనివారం నుండి ఏప్రిల్ 16 వరకు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేయాలని డీసీపీ ధార కవిత ఆదేశించారు.


ఎవరైనా పోలీస్ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని డీసీపీ హెచ్చరించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఎవ్వరు ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు,అవరోధాలు సృష్టించి ప్రయత్నాలు చేసే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎగ్జామ్స్ సెంటర్స్ వద్ద పోలీస్ బందోబస్తు తో పాటు పోలీస్ పెట్రోలింగ్, మొబైల్ టీమ్స్ గస్తీ నిర్వహిస్తాయని సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత తెలిపారు.

Leave a Reply