14 ఏళ్ల వయసులోనే సెయిలింగ్‌లో రాణింపు

ప్రశంసించిన‌ భారత నేవీ చీఫ్ అడ్మినరల్ త్రిపాఠి


న్యూఢిల్లీ-ఆంధ్రప్రభ ప్రతినిధి : హైదరాబాద్ (Hyderabad) లోని రెయిన్ బో హోమ్స్ లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని రమీజా భాను భారత నేవీ చీఫ్ అడ్మినరల్ త్రిపాఠి ప్రశంసలు అందుకున్నది. సికింద్రాబాద్‌లోని అమన్ వేదిక హోమ్ ఫర్ గర్ల్స్ మెడిబావికి చెందిన 14ఏళ్ల రమీజా భాను చిన్న వయసులోనే సెయిలింగ్‌లో రాణిస్తోంది. యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్, అధ్యక్షులు, ఇతర కోచ్‌ల సారథ్యంలో వివిధ రాష్ట్రాల్లో సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌లలో పాలుపంచుకున్నది. తాజాగా రమీజా బాను (Rameeza Bhanu) సెయిలింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల అక్టోబర్ 13 నుండి నవంబర్ 2 వరకు ఒమన్‌లో జరుగనున్న ముసన్నా సెయిలింగ్ ఛాంపియన్‌షిప్- 2025లో మన దేశం తరపున పాల్గొనేవారిలో ఒకరిగా అర్హత సాధించింది.

అయితే రమీజా విజయాల పరంపర గురించి తెలుసుకున్న భారత నేవీ అడ్మినల్ త్రిపాఠి సదర్ విద్యార్థిని ఢిల్లీకి స్వయంగా ఆహ్వానించారు. ఈ మేరకు రమీజా భాను భారత నేవీ చీఫ్ ను సుహీమ్ షేక్, కోచ్ ప్రీతి కొంగర, చందన చక్రవర్తిలతో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత నేవీ చీఫ్ అడ్మిరల్ త్రిపాఠి విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు మెమొంటోను అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

ఇదిలా ఉండగా రమీజా భాను (Rameeza Bhanu) చిన్న వయసులోనే సెయిలింగ్‌లో రాణించడం రెయిన్‌బో హోమ్స్‌కు గర్వకారణమని రెయిన్‌బో హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ, రెయిన్‌బో హోమ్స్ రెసిడెన్షియల్ కేర్ డైరెక్టర్ అంబిక, రెయిన్‌బో ఫౌండేషన్ ఇండియా బోర్డు సభ్యురాలు శ్రీలత, సిటీ డెస్క్ ప్రోగ్రామ్ మేనేజర్ క్రాంతి, ప్రాజెక్ట్ ఇంచార్జ్‌లు యెల్లయ్య నమ్రత జైస్వాల్ పేర్కొన్నారు. రమీజా బాను మరిన్ని విజయాలను సొంతం చేసుకుని దేశానికి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు.

Leave a Reply