ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రాధాన్యం
వర్షాల కారణంగా ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
అధికారులకు కర్నూలు కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశం
కర్నూలు బ్యూరో, అక్టోబర్ 22, ఆంధ్రప్రభ : వాయుగుండం ప్రభావంతో వచ్చే కొన్ని రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ (Collector) డా. ఏ. సిరి ఆదేశించారు. తాజాగా జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆమె, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రిజర్వాయర్లు, చెరువులు, లోతట్టు ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలను నిరంతరం పరిశీలించాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని, ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయాలని సూచించారు.
సమన్వయం అవసరం..
రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులు (Electricity department officials) సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు. వాగులు, వంకల వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉన్న చోట వాహన రాకపోకలు నిలిపివేసి, ప్రజలను సురక్షిత మార్గాలపైకి మళ్లించాలి చెప్పారు.
విద్యుత్ శాఖ జాగ్రత్తలు ..
విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ (Collector) ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు రైతులకు పంట నష్టం జరగకుండా అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆమె అన్నారు.
కంట్రోల్ రూములు, షెల్టర్ సెంటర్ల ఏర్పాటు..
జిల్లా కేంద్రం సహా ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ (Control room) ఏర్పాటు చేయాలని, పరిస్థితులను నిరంతరం సమీక్షించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రజలను తరలించాల్సిన అవసరం వస్తే షెల్టర్ సెంటర్లను గుర్తించి, ఆహార పదార్థాలు, తాగునీరు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేంతవరకు అప్రమత్తంగా ఉండాలి. ప్రజల రక్షణకే ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ డా. ఏ.సిరి స్పష్టం చేశారు.
