ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణి సస్పెండ్.
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : దేవరకొండ ఎస్టి బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
దేవరకొండ ఎస్టి బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మాధవి అనే విద్యార్థిని ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం రోజు పాఠశాలలో డెటాల్ సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది.
తన కూతురు ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ప్రిన్సిపల్ కళ్యాణి, విజయలక్ష్మి, అమృత అనే ఉపాధ్యాయులే కారణమని తల్లి కళ మీడియా ఎదుట ఆరోపించింది.
వారి ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మీడియాకు ప్రకటన విడుదల చేసింది. బాలిక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై దేవరకొండ తాసిల్దార్ మధుసూదన్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మాధవిని అడిగి తెలుసుకున్నారు.
బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనను సీరియస్ గా పరిగణించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రిన్సిపల్ కళ్యాణి ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు విజయలక్ష్మి, అమృతలపై శాఖా పరమైన విచారణ చర్యలు తీసుకుంటారని సమాచారం.

