16న కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన
- జీఎస్టీ సంస్కరణలు మోదీ ఆలోచనలకు ప్రతిబింభం
- బీజేపీ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్
( కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో ): మోదీ పర్యటన రాయలసీమకు నూతన ఉత్సాహాన్ని అందిస్తుందని బీజేపీ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ (TG Venkatesh) పేర్కొన్నారు. మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. మంగళవారం ఆయన కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి ఆర్థికంగా బలాన్నిచ్చిన జీఎస్టీ సంస్కరణలు మోదీ ఆలోచనలకు ప్రతిబింభం అని, ప్రజలపై భారాన్ని తగ్గించే దిశగా జీఎస్టీ సవరణలు తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా కేంద్రం సహకారం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తరచూ కేంద్రాన్ని కలిసి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో బీజేపీ అండగా నిలుస్తుందని తెలిపారు. రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి కోసం కేంద్రం పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కాలంలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పరిశ్రమల స్థాపన మళ్లీ వేగంగా సాగుతోందని తెలిపారు. “రాయలసీమ హక్కుల ఐక్య వేదిక రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూడా కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. భవిష్యత్తులో కర్నూలును సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు.
మోదీ పర్యటనను విజయవంతం చేయాలి…
బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ (BJP Rayalaseema Declaration) ప్రకారం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు కచ్చితంగా జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోదీ పర్యటనను విజయం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.