Prices Are Rising High| కొండదిగని కూరగాయలు..

- జీఎస్టీ తగ్గినా… తగ్గనంటున్న నిత్యవసరాలు..
- మొంథా ఎఫెక్ట్… మరింత మండుతున్న ధరలు..
పొన్నలూరు, ఆంధ్రప్రభ : కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. కోడిగుడ్ల ధర ఒక్కో గుడ్డు పై రూ.2.50 పెరిగింది. మొంథా తుఫాను ప్రభావంతో కూరగాయల ధరలు అమాంతంగా ఎగసిపోయాయి. శీతాకాలంలో మంటలు మండిస్తున్న మునగకాయలు కిలోకు రూ.350 పలుకుతున్నాయి. టమోటా ధరలు కిలోకు రూ.60 నుంచి రూ.80 వరకు చేరాయి.
నూనెలు, పప్పులు వంటి నిత్యావసరాలు కూడా అధిక ధరలకు కొండెక్కాయి.. ఈ పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు, నిత్యావసరాలు కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందని, దీంతో ధరలు తగ్గుతాయని పేద ప్రజలు ఆశించారు. కానీ వ్యాపారస్తులు గత ఎమ్మార్పీ కంటే ఎక్కువ ఎమ్మార్పీ ధరలు ముద్రించడంతో తగ్గింపుల ప్రభావం వినియోగదారులకు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెంచిందని విమర్శిస్తే, నేటి కూటమి ప్రభుత్వం కూడా ధరల నియంత్రణలో విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
గతంలో కోడిగుడ్డు ధర రూ.4.75 ఉండగా, ఇప్పుడు రూ.8కి పెరిగిందని ప్రజలు చెబుతున్నారు. రైతుల పండించిన కూరగాయలను దళారులు కేవలం రూ.5–రూ.10కే కొనుగోలు చేసి, మార్కెట్‌లో రూ.60–రూ.80కు అమ్మేస్తున్నారని రైతులు వేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు రైతులు పొట్ట కొడుతున్నారని రైతుల ఆవేదన చెందుతున్నారు.
పెరిగిన ధరల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కాసీతమ్మ మద్యాహ్న భోజన పథకం మెనూని అమలు చేయడంలో నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. పొన్నలూరు మండలం లోని దుకాణాల్లో ఎక్కడా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ నిబంధనలు అమలవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఏ ఒక్క దుకాణం వద్ద ధరల పట్టికలు లేకపోవడంతో, దుకాణదారులు తమ ఇష్టానుసారం అధిక ధరలు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకే రకమైన వస్తువుకు షాపులో ఒక రేటు, వీధిలో మరో రేటు చెప్పి, వినియోగదారులను మోసం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
కొనుగోలుదారులు ధరపై ప్రశ్నిస్తే… “ఇష్టం లేకపోతే కొనొద్దు… మా వస్తువులు, మా ఇష్టం” అంటూ దుకాణదారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అదనంగా, కొలతలు, తూకాల్లో కూడా మోసం జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి వినియోగదారుల ఇబ్బందులను తొలగించాలని పేద, మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు.
