కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుండి సవరించిన జీఎస్టీ (GST) రేట్లను అమలులోకి తెచ్చింది. దీంతో సాధారణ ప్రజలు, మధ్య తరగతి కుటుంబాలు, రైతులు, వ్యాపార వర్గాలకు భారీ ఉపశమనం లభించింది. అయితే, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, బీడీ వంటి కొన్ని వస్తువులపై ప్రస్తుత జీఎస్టీ కొనసాగుతుంది.
అయితే, జీఎస్టీ రేట్లు తగ్గినప్పటికీ, చాలా సూపర్ మార్కెట్లు, దుకాణాల్లో పాత ఎమ్మార్పీ (MRP) ధరలకే వస్తువులను అమ్ముతున్నారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం. దీనికోసం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ INGRAM పోర్టల్లో ప్రత్యేక జీఎస్టీ ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేసింది.
ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఈ-కామర్స్, FMCG వంటి అనేక రంగాలకు సంబంధించి.. 1915 లేదా 8800001915కు కాల్ చేసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. టోల్‌ఫ్రీ నంబర్లతో పాటు, వాట్సాప్, SMS, ఇమెయిల్, NCH యాప్, వెబ్ పోర్టల్, లేదా UMANG యాప్‌ల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. వ్యాపారులు జీఎస్టీ తగ్గింపుల ప్రయోజనాలను వినియోగదారులకు అందించేలా చూడటమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశం.
జీఎస్టీ 2.0
2017 తర్వాత కేంద్రం చేపట్టిన అతి పెద్ద జీఎస్టీ సవరణ ఇది. పాత 5%, 12%, 18%, 28% శ్లాబులను కేవలం 5% & 18%కి పరిమితం చేశారు. ఆహార ధాన్యాలు, మందులు, విద్యా ఉత్పత్తులు వంటివి 5% శ్లాబ్లో అందుబాటులో ఉంటాయి. గృహోపకరణాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటివి మరింత సరసమైన ధరలకు లభిస్తాయి.