పేరూరులో ప్రజాపాలన ప్రగతి గ్రామసభ…

కౌకుంట్ల, ఆంధ్రప్రభ : కౌకుంట్ల మండలం పేరూరు గ్రామంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామ సభ సాఫీగా సాగింది. గ్రామ స్పెషల్ ఆఫీసర్, ఎంపిడిఓ శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో సర్పంచ్ కొత్త శృతి, అరవింద్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ గొల్ల రాములు, పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్ తో పాటు వార్డు సభ్యులు, గ్రామ పరిపాలన అధికారులు పాల్గొన్నారు.
సుమారు గంటన్నర పాటు కొనసాగిన ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను యువకులు గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు.వాటిపై స్పందించిన సర్పంచ్,సంబంధిత అధికారులు, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కొత్త అరవింద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…ప్రజాపాలనలో ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. అలాగే, నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కూడా త్వరలోనే లబ్ధిదారులకు కేటాయించి, అక్కడ నివసించే వారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఈ పనుల కోసం రూ.80 లక్షల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. అంతకుముందు కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు కంటి పరీక్ష నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మ,గ్రామ పెద్దలు,యువకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
