చేపల వినియోగం పెంచేందుకు…

  • ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద యూనిట్లు
  • రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్


కర్నూలు బ్యూరో, అక్టోబర్ 11 (ఆంధ్రప్రభ) : చేపల వినియోగం పెంచేందుకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద యూనిట్లు మంజూరు చేయడం జరుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ (TG Bharat) పేర్కొన్నారు. శనివారం నన్నూరు టోల్ గేట్ వద్ద ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద వైబ్ ఇన్ రెస్టారెంట్ లో చేపల విలువ ఆధారిత యూనిట్ ను పాణ్యం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి, ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… చేపల ఉత్పత్తుల ప్రాసెసింగ్ (fish products Processing), విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా మత్స్యకారులకు ఆదాయ వనరులు పెరుగుతాయని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం చేపల విలువ ఆధారిత యూనిట్ల ద్వారా మత్స్య పరిశ్రమను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. స్థానికంగా లభ్యమయ్యే చేపలతో ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన వంటకాలను అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకతగా ఉందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ… చేపల విలువ ఆధారిత యూనిట్ లో భాగంగా ప్రజల్లో చేపలు, రొయ్యలు, పీతల వినియోగం పై అవగాహన కల్పించే విధంగా జిల్లాలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం (Prime Minister’s Fisheries Development Scheme) కింద ఈ యూనిట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో 75శాతం చేపలు, రొయ్యలు, పీతల ఐటమ్ లు ఉంటాయని, మిగిలిన 25శాతం చికెన్, మటన్ లాంటి వంటకాలు ఉంటాయన్నారు. యూనిట్ ధర రూ.50 లక్షలు అని, ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుండి 60శాతం సబ్సిడీ అందచేయడం జరిగిందన్నారు. మిగిలిన 40శాతం లబ్ధిదారుని వాటాగా ఉంటుందన్నారు.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత (MLA Gauru Charita) మాట్లాడుతూ.. చేపలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, అందువల్ల ప్రజలు చేపలు బాగా తిని ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి రెస్టారెంట్లు ఏర్పాటు చేయించి ప్రోత్సాహకాలు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ, డిప్యూటీ డైరెక్టర్ డా.రంగనాథ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply