Postponed | తిరువూరు చైర్మన్ ఎన్నిక మళ్ళీ వాయిదా….

కౌన్సిల్ కి హాజరుకాని టిడిపి, వైసిపి కౌన్సిలర్లు..
కార్యాలయం గేటు ముందే ఎమ్మెల్యేతో టిడిపి కౌన్సిలర్లు…
కనీస జాడలేని వైసీపీ కౌన్సిలర్లు….
సరైన కోరం లేక వాయిదా వేసిన ఆర్డిఓ..
ఎస్ఇసి కి నివేదిక పంపనున్న ఎన్నికల అధికారి…
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతోనే ఎన్నిక….
నిన్నటి ఉదృత పరిస్థితుల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత…
మున్సిపల్ కార్యాలయం చుట్టూ 144 సెక్షన్….
తిరువూరుకు వచ్చే అన్ని రహదారులు దిబ్బంధం…
ఎన్నిక ప్రక్రియకు బయలుదేరిన అవినాష్, స్వామి దాసు, మొండితో అరుణ్ కుమార్ లు…
ఏ కొండూరులో వైసీపీ నాయకుల నిలుపుదల…
పంపించాల్సిందే అంటూ పోలీసులతో వాగ్వివాదం

(ఆంధ్రప్రభ, తిరువూరు) – తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక మరోసారి కోరం లేక వాయిదా పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సోమవారం చైర్మన్ ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు పట్లు చేస్తే, టిడిపి కౌన్సిలర్లు వారికి మద్దతు ఇచ్చిన కౌన్సిలర్లు 7 గురు మాత్రమే సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రక్రియకు హాజరుకావడంతో, కోరం లేక ఎన్నికను ఈనెల 20 మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో మాధురి ప్రకటించారు. అయితే సోమవారం మున్సిపల్ కార్యాలయ పరిసరాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కార్యాలయ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ విధించిన పోలీసులు, బయట వ్యక్తులను తిరువూరులోకి రాకుండా నిరోధించేందుకు తిరువూరులోకి వచ్చే అన్ని మార్గాల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకి చైర్మన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో మాధురి ప్రకటించగా కౌన్సిల్కు ఏ ఒక్క కౌన్సిలర్ హాజరు కాలేదు. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ముగ్గురు, వారికి మద్దతిస్తున్న మరో నలుగురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రావు తో కలిసి మున్సిపల్ కార్యాలయం గేటు ముందే నుంచున్నారు. ఎన్నిక ప్రక్రియ కోసం లోపలికి వెళ్లిన ప్రయత్నం చేయలేదు. ఇదే సమయంలో వైసీపీ కౌన్సిలర్ల జాడ కనీసం చుట్టుపక్కల ఏ ప్రదేశంలోనూ కనిపించలేదు.

బలా బలాలు ఇలా…

తిరువూరు నగర పంచాయతీ కి సంబంధించి మొత్తం 20 మంది కౌన్సిలర్లులకు ఓటు హక్కు ఉండగా ఎక్స్ అఫీషియల్ హోదాలో ఎమ్మెల్యే ఓటుతో కలిపి మొత్తం 21 ఓట్లు ఉన్నాయి. వీరిలో తెదేపాకు ముగ్గురు కౌన్సిలర్లు ఉండగా, వైసీపీకి చెందిన కౌన్సిలర్లలో కాకర్లమూడి సుందర్ కుమార్ పసుపులేటి శరత్ బాబు తెదేపాలో చేరారు. మరో ఇద్దరు వైసిపి కౌన్సిలర్లు దారా పద్మా నీలిమ, గతం కస్తూరిబాయి కూడా తెలుగుదేశం పార్టీకి బయట నుండి మద్దతు ఇస్తున్నారు. మరో వైసీపీ కౌన్సిలర్ కొలికపోగు నిర్మల భర్త చంటి కూడా తాజాగా టిడిపిలో చేరారు. దీంతో మొత్తం వాట్లలో తెదేపాకు 9, వైసిపికి 12 ఓట్లు ఉండగా వైసీపీకి చెందిన ఒక కౌన్సిలర్ రమాదేవి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. దీంతో వైసిపి బలం 11 కు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో వైసీపీకి చెందిన మరో ముగ్గురు నుండి ఐదుగురు కౌన్సిలర్లు తెలుగుదేశంతోపాటు, జనసేన పార్టీలో చేరెందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

…. పోలీసులు అదుపులో వైసీపీ నాయకులు…

తిరువూరు వైసిపి కౌన్సిలర్లకు మద్దతుగా విజయవాడ నుండి తిరువూరు వస్తున్న జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్, తిరువూరు ఇన్చార్జ్ స్వామి దాసులను ఏ కొండూరు మండలం రేపూడీ క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు నిలువరించారు. బయట వ్యక్తులకి తిరువూరులోకి ప్రవేశం లేదంటూ వారిని నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు వైసీపీ నాయకులకు తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పడంతో సిఐ గిరిబాబు వైసిపి నాయకులను అదుపులోకి తీసుకుని వారిని రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కి తరలించారు. నాయకులను అదుపులోకి తీసుకోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కి తరలి రావడంతో అక్కడ కూడా ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

… రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు చేరిన పంచాయితీ…

తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి చేరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల అధికారి ఆర్డీవో మాధురి రెండుసార్లు ఎన్నిక ప్రక్రియను నిర్వహించగా సోమ మంగళవారాల్లో సరైన కోరం లేక వాయిదా వేయాల్సి వచ్చింది. వరుసగా రెండుసార్లు వాయిదా పడిన ఎన్నిక సమగ్ర సమాచారాన్ని ఎన్నికల అధికారి ఆర్డీవో మాధురి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నివేదిక రూపంలో అందించనున్నారు. దీంతో తదుపరి ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరైన నిర్ణయం తీసుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *