ఎమ్మెల్యే దగ్గుపాటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్

పోలీసుల లాఠీ ఛార్జ్.. పలువురు అరెస్ట్

(ఆంధ్రప్రభ, అనంతపురం బ్యూరో) :అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ (Mla Daggubati)కి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు (junior NTR fans) షాక్ ఇచ్చారు. అనంతపురంలో ఆయన కార్యాలయం వద్దకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దూసుకుపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకొని లాఠీఛార్జ్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను, ఆయన తల్లిని దగ్గుపాటి ప్రసాద్ దూషించినట్లు ఫ్యాన్స్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భేషరతుగా క్షమాపణ చెప్పాలని అభిమాన సంఘం డిమాండ్ చేసింది. అయితే దగ్గుపాటి ఒక ఆడియో రిలీజ్ చేసి మళ్లీ పట్టించుకోలేదు. దీంతో ఆయన నివాసం వద్ద ఆందోళన చేస్తామని అభిమాన సంఘం హెచ్చరించింది. ఇందులో భాగంగానే ఆదివారం అభిమాన సంఘం సభ్యులు వచ్చి ఆందోళన నిర్వహించారు. కేవలం అనంతపురం నుంచి కాకుండా బళ్లారి కర్నూలు కడప ప్రాంతాల నుంచి అభిమాన సంఘం సభ్యులు అనంతపురానికి బయలుదేరుతామని ప్రకటించడంతో పోలీసులకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మరికొన్ని చోట్ల అనంతపురం రాకుండా వారిని అడ్డుకున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇదివరకు దగ్గుపాటిని చంద్రబాబు నాయుడు పిలిపించి హెచ్చరించిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. అయినప్పటికీ అతనిపై క్రమశిక్షణ చర్యగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అభిమాన సంఘం డిమాండ్ చేస్తోంది.

Leave a Reply