పోలీసుల దర్యాప్తు ముమ్మరం

పోలీసుల దర్యాప్తు ముమ్మరం

ఇప్పటికి 12 మంది అనుమానితులు
వైసీపీ సర్పంచ్ సహా టీడీపీ నేత ఉక్కిరిబిక్కిరి
విచారణలో మరో ఐదుగురు మహిళలు
రంగంలో మానవ హక్కుల కమిషన్
దోషుల్ని వదలొద్దు.. సీఎం ఆదేశం

( చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ) ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన అంబేద్కర్ విగ్రహం దహనం ఘటన నేపథ్యంలో.. అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుట్రదారులెవరో.. పోలీసులు జల్లెడ పడుతున్నారు. దేవళం గ్రామంలో.. చిన్న స్థలం ఆక్రమణ గొడవ .. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం దహనం వరకూ దారి తీసిందంటే.. ఇది ఊహ కాదు. పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తున్న చీకటి కథ . ఇది సరే దోషులను పట్టుకోవాలని అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు రోడ్డెక్కి గొంతు చించుకుంటుంటే.. తాము ఎవరి శిబిరంలో కాలు పెట్టాలో అర్థం కాక నడుమ దళిత సంఘాలు కళ్లప్పగించి చూస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని రాజకీయపార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. పల్లెల్లో పాగా వేయటానికి అన్ని వ్యూహాలను రచిస్తున్నాయి. ఇదే తరుణంలో చిత్తూరు జిల్లా రాజకీయ పార్టీలకు ప్రపంచ మేధావి ..సర్వ మానవ సమానత్వం ప్రబోధించిన అంబేద్కర్ విగ్రహాన్ని .. పొలిటికల్ ఫైట్ కోసం పావులుగా వాడేస్తున్నారని .. సభ్య సమాజం ఘోషిస్తోంది. ప్రస్తుతం గంగాధర నెల్లూరు మండలం దేవళం పేట కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సుమారు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తున్నారు.

వైసీపీ అనుచరుడు, స్థానిక సర్పంచ్ గోవిందయ్య, టీడీపీ నేత సురేష్ నాయుడు సహా మరో ఐదుగురు మహిళలను విచారిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ సంచలనానికి దారి తీయటంతో కేసు దర్యాప్తుపై పోలీసులు పూర్తిగా దృష్టిని కేంద్రీకరించారు. విషయం తెలియగానే శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఘటన స్థలికి చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడి దోషులను తొందర్లోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టినట్లు పోలీసులు కేసును నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ గా తీసుకున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. త్వరగా దోషులను పట్టుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశించింది. శనివారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి తదితరులు దేవళం పేట అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించి, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాలిన అంబేద్కర్ విగ్రహం స్థానంలో శుక్రవారం రాత్రి ప్రభుత్వం తరఫున కొత్త అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించింది. దేవళం పేటకు చిత్తూరు ఎంపీ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే జగన్ మోహన్ , జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజన్ అంబేద్కర్ వచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తెరమీదకు చీకటి కథ

స్థానికుల కథనం మేరకు అంబేద్కర్ విగ్రహానికి మంటలు యాదృశ్చికం అని ప్రచారం జరుగుతోంది. అంబేద్కర్ విగ్రహానికి సమీపంలో ఒక మహిళ నివసిస్తోంది. ఆ మహిళ విగ్రహానికి సమీపంలోని స్థలంలో టెంకాయ మట్టలను వేసి ఉంచారు. స్థానిక విభేదాల కారణంగా కొందరు గురువారం రాత్రి అంబేద్కర్ విగ్రహం సమీపంలోని టెంకాయ మట్టలకు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ నిప్పు చెలరేగి అంబేద్కర్ విగ్రహానికి సోకి, విగ్రహం కాలిపోయింది. ఈ ఘటనతో రాజకీయం చేయాలని గ్రామంలోని ఒక వర్గం వ్యూహాత్మకంగా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. స్థానిక వైసీపీ నాయకులతో ఇటీవల టీడీపీలోకి కొందరు చేరారు. కొత్తగా వచ్చిన వైసీపీ నేతలతో ఇమడలేని వర్గం ఈ మధ్య దూరంగా ఉంటోంది. మండల స్థాయిలోని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను రాజకీయంగా దెబ్బతీయడానికి ఇంకో వర్గం ప్రయత్నం ప్రారంభించినట్టు స్థానికులు గుసగుసలాడుతున్నారు. ఏది ఏమైనా ఒకటి, రెండు రోజుల్లో ఈ ఘటనకు కారకులను పోలీసులు గుర్తించే అవకాశం ఉంది. సర్పంచికి మద్దతుగా టీడీపీలో ఓ వర్గం.. కొత్తగా చేరిన నేతలకు మరో వర్గం కొమ్ముకాస్తున్న తరుణంలో.. అంబేద్కర్ విగ్రహాన్ని రాజకీయ రగడకు ఈ రెండు పార్టీలు వాడేస్తుంటే.. బై భీమ్ .. అని నినదించే ఇక అంబేద్కర్ వారసులూ.. ఈ రెండు పార్టీల చెంతన చేరాయి.

Leave a Reply