Police Commissioner | భవానీల మనోభావాలను గౌరవించాలి

Police Commissioner | భవానీల మనోభావాలను గౌరవించాలి
- దీక్ష విరమణలకు పటిష్ట బందోబస్తు
- విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
- అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలి
- అలసత్వానికి తావివొద్దు
- విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు
- బందోబస్తు సిబ్బందికి దిశానిర్దేశం
Police Commissioner | (ఆంధ్రప్రభ విజయవాడ) : భవానీ దీక్షలను ఆచరించి అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తుల మనోభావాలకు తగిన గౌరవం ఇవ్వాలంటూ విజయవాడ పోలీస్ (Police) కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు సూచించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈనెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 5 రోజుల పాటు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరుగుతుంది. భవానీ దీక్షమాల విరమణలను పురస్కరించుకుని నగరం నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భవానీ భక్తులు విచ్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేశారు.

భవానీ దీక్షా విరమణను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బందోబస్తు విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీస్ అధికారులకు ఈ రోజు గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ (Police Stayion) పరిధిలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భవానీ భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాఖాపరంగా పాటించవలసిన నియమ నిబంధనల గురించి, గిరిప్రదక్షణ రూట్‌ను, హోల్డింగ్ ఏరియాలు, స్నానఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలు మొదలైన ప్రదేశాలను డ్రోన్ కెమెరా వీడియోల రూపంలో వివరించి సూచనలు, సలహాలను అందజేశారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు బందోబస్తుకు విచ్చేసిన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు
భవానీ దీక్షా విరమణ బందోబస్తు డ్యూటీలను రెండు షిప్టులలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, బయట నుండి వచ్చే అధికారులు, సిబ్బంది వారికి అనువుగా వసతి ఏర్పాటు చేయడం జరిగిందని, ఐందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందికి ఏవైన సమస్యలు ఉంటే వెంటనే పర్యవేక్షణాధికారులకు తెలియజేయాలని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు (Rajashekar Babu) వివరించారు. ముఖ్యంగా అమ్మవారి అంతరాలయం పరిసర ప్రాంతాలు, కొండ దిగువన, క్యూలైన్లు, విరుముడి విరమణ ప్రదేశాలు, హోమగుండాలు, ప్రసాదం కౌంటర్లు, కనకదుర్గా నగర్, రైల్వేస్టేషన్, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు జేబు దొంగతనాలు, గొలుసు దొంగతనాలు జరుగకుండా ఉండేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సంవత్సరం భవానీ దీక్షల విరమణ బందోబస్తును 12 కాంపోనెంట్లలో మొత్తం 71 సెక్టార్లుగా విభజించి వివిధ జిల్లాల నుంచి, ఎన్టీఆర్ (Ntr) జిల్లా పోలీస్ కమిషనరేట్ నుంయి మొత్తం 4129 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణ కాంత్ పటేల్, బి.లక్ష్మీనారాయణ, షిరీన్ బేగం, ఎస్.వీ.డీ.ప్రసాద్, జి.ఆనంద్ బాబు ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ , ఇతర ఏడీసీపీలు, ఏసీసీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

