స్థానిక సంస్థల ఎన్నికల్లో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల ప్రకారం సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్, పురాణిపేట్ ప్రాంతాల్లో ఎస్సై కె. సందీప్ నాయకత్వంలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. కార్లు, ద్విచక్ర వాహనాలు సహా అన్ని వాహనాలను నిలిపి పత్రాలను పరిశీలించారు.
ఎన్నికల కమిషన్ నిబంధనలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై సందీప్ సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎటువంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే సంబంధిత రశీదులు తప్పనిసరిగా వెంట ఉంచాలని, రశీదులు లేకపోతే నగదు స్వాధీనం చేస్తామని తెలిపారు.
ఎన్నికల వేళ మద్యం అక్రమ రవాణాపై పటిష్ట నిఘా అమల్లో ఉందని ఎస్సై సందీప్ తెలిపారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై ఎవరైనా సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడికే చేరుకుని తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు.
తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ సంతోష్, కానిస్టేబుల్ మల్లేష్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
