తండ్రిని హతమార్చిన తనయుడు..

తండ్రిని హతమార్చిన తనయుడు..
మందస(పలాస), ఆంధ్రప్రభ : పున్నామ నరకం నుండి కాపాడుతాడని, కొడుకు పుట్టాలని ఎన్నో పూజలు చేసిన తల్లిదండ్రులకు కొడుకే కాల యముడైన సంఘటన చోటుచేసుకుంది. మందస మండలం లోహరిబంద గ్రామంలో ఆదివారం దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తాళ్ల లక్ష్మీనారాయణ (65)ను ఆయన పెద్ద కుమారుడు తాళ్ల ఏకాంబరరావు హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, ఏకాంబరరావు కొంత కాలంగా మానసిక సమస్యతో బాధపడుతూ పెద్ద వాల్తేరు ప్రాంతంలో చికిత్స పొందుతున్నాడు.
ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ మద్యంకు అలవాటు పడ్డాడు. మద్యం కోసం తరచూ తల్లిదండ్రులను వేధించేవాడని సమాచారం. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తండ్రితో గొడవ చోటుచేసుకోగా, ఆగ్రహంతో ఏకాంబరరావు తన తండ్రిని నేలపై పడగొట్టి తీవ్రంగా కొట్టడంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మందస ఎస్.ఐ కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
