ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశ యువత, ఆర్థిక పురోగతి కోసం ప్రధాని నరేంద్ర మోదీ (pm modi) అనేక కొత్త ప్రణాళికలను ప్రకటించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా ఎర్రకోట (Red Fort) నుంచి ప్రధాని చేసిన ప్రసంగంలో ఈ విషయాలను వెల్లడించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన్’ (pradhan mantri viksit bharat rozgar yojana) ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద లక్ష కోట్లతో ఒక కొత్త ప్రణాళికను రూపొందించారు. దీని ద్వారా ప్రైవేట్ రంగంలో కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి మొదటి నెలలో ప్రభుత్వం తరఫున 15,000 అందజేయనున్నారు. ఇది యువతకు ఆర్థిక భద్రతను కల్పించడంలో సహాయపడుతుందన్నారు.
ఆర్థిక స్వయం సమృద్ధిని గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు ఆహార ధాన్యాల కోసం ఇబ్బందులు పడిన భారత్, ఇప్పుడు ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద రక్షణ రంగంలో సాధించిన విజయాలను ప్రశంసించారు. అలాగే, త్వరలో దేశీయంగా తయారు చేయబడిన సెమీకండక్టర్లు మార్కెట్లోకి వస్తాయని ప్రకటించారు. ఇది దేశం సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి దోహదపడుతుందని తెలిపారు.
జీఎస్టీ సంస్కరణల గురించి ప్రధాని మాట్లాడుతూ.. దీపావళిలోగా కొత్త తరం సంస్కరణలను తీసుకువస్తామని, అవి సామాన్య ప్రజలపై భారాన్ని తగ్గిస్తాయని తెలిపారు. ఈ సంస్కరణలను రాష్ట్రాలతో చర్చించి అమలు చేస్తామని చెప్పారు. ఈ చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.