బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా ..

బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా ..
పాత ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావుచే ప్రారంభం..
ఐదుగురు బాలికలకు తొలి మోతాదు..
పాయకాపురం, ఆంధ్ర ప్రభ : బాలికలను గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించిన హెచ్‌పీవీ (హ్యూమన్ పంపిల్లొమా వైరస్ ) టీకా కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా ప్రారంభించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదుగురు బాలికలకు తొలి దశలో టీకాలు అందజేశారు.
టీకా తీసుకున్న వారిలో ఆరేళ్ల నవ్య శ్రీ సాయి, కరాకుల మనోజ్ఞ శ్రీ, బి.హారిక, వి.స్వాతి, వి.దీక్షిత ఉన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎం.శరత్ బాబు, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఇందుమతి దేవి, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. హెచ్‌పీవీ వైరస్, గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల మహిళల్లో గర్భాశయ ముఖ క్యాన్సర్ (సర్వూకల్ కాన్సర్ ) వచ్చే ప్రమాదం ఉంది.
ఈ వైరస్‌కు వ్యతిరేకంగా టీకా తీసుకుంటే భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు. వైద్య నిపుణుల ప్రకారం టీకాతో పూర్తిగా నివారించగలిగే అరుదైన క్యాన్సర్లలో ఇది ఒకటి. ఈ టీకా ప్రధానంగా 14 సంవత్సరాలు పూర్తయి ఇంకా 15 సంవత్సరాలు పూర్తి కాని బాలికలకు ఇవ్వబడుతుంది. కార్యక్రమం ప్రారంభమైన తేదీ నుంచి 90 రోజుల్లో 15 సంవత్సరాలు పూర్తి చేసుకునే బాలికలు కూడా టీకా పొందేందుకు అర్హులు.
ఈ వయస్సు గుంపు మొత్తం జనాభాలో సుమారు ఒక శాతం ఉంటుందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘గార్డాసిల్–4’ అనే టీకాను ఉపయోగిస్తున్నారు. ఇది క్వాడ్రివాలెంట్ టీకాగా పిలువబడుతుంది. హెచ్‌పీవీ వైరస్ రకాలైన 6, 11, 16, 18 నుంచి రక్షణ కల్పిస్తుంది. టీకాను కేవలం ఒకే మోతాదుగా 0.5 మిల్లీలీటర్ల పరిమాణంలో కండరంలో ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. సాధారణంగా ఎడమ పైభుజంలో టీకా వేస్తారు. ఈ టీకా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే ఈ టీకా అందుబాటులో ఉంటుంది.
అక్కడ కోల్డ్ చైన్ పాయింట్లు, టీకా తర్వాత వచ్చే ప్రతికూల ప్రభావాల పర్యవేక్షణకు ప్రత్యేక వైద్యులు, అలాగే ఇంటర్నెట్, కంప్యూటర్, ప్రింటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. టీకా కోసం యూ విన్ అనే డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా నమోదు చేసుకునే సౌకర్యం ఉంది. స్వయంగా నమోదు చేసుకోవచ్చు లేదా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది సహాయంతో కూడా నమోదు చేయవచ్చు.
నేరుగా ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కూడా టీకా తీసుకునే అవకాశం ఉంది. హెచ్‌పీవీ టీకా స్వచ్ఛందంగా ఇవ్వబడుతుంది. అయితే బాలికలకు టీకా వేయడానికి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమ్మతి తప్పనిసరిగా తీసుకుంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టీకా ఇవ్వరు. మధ్యస్థం లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న బాలికలకు పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే టీకా వేస్తారు. ఈస్ట్‌కు అలర్జీ ఉన్నవారు లేదా గతంలో ఏదైనా టీకాకు తీవ్రమైన అలర్జీ వచ్చినవారికి ఈ టీకా ఇవ్వరు.
టీకా తీసుకునే ముందు బాలికలు ఖాళీ కడుపుతో ఉండకూడదని వైద్యులు సూచిస్తున్నారు. టీకా వేసుకున్న తర్వాత కనీసం 30 నిమిషాల పాటు ఆరోగ్య కేంద్రంలో ఉండాలని తెలిపారు. టీకా తర్వాత ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి, వాపు, ఎర్రదనం, స్వల్ప జ్వరం, తలనొప్పి, అలసట వంటి స్వల్ప దుష్ప్రభావాలు కనిపించవచ్చు. ఇవి సాధారణంగా ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గిపోతాయని వైద్యులు తెలిపారు. కొన్నిసార్లు సూదికి భయంతో తల తిరగడం లేదా మూర్చ రావడం కూడా జరిగే అవకాశముందని పేర్కొన్నారు. బాలికల ఆరోగ్య రక్షణకు ఈ టీకా కార్యక్రమాన్ని తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
