వేసవి దృష్ట్యా ముందస్తు ఏర్పాట్లు చేయండి..

వేసవి దృష్ట్యా ముందస్తు ఏర్పాట్లు చేయండి..
ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి..
తిరువూరు నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష
నాలుగు మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలతో సమావేశం..
వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, డ్రైనేజీ శుభ్రత, ఉపాధి హామీ పనులపై దిశానిర్దేశం..
తిరువూరు శాసనసభ్యుడు కొలకపూడి శ్రీనివాసరావు…
తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు, గ్రామీణ సమస్యల పరిష్కారంపై శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నాలుగు మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు పాల్గొని వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై వివరాలు అందించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా అంశంపై ప్రత్యేకంగా చర్చించారు.
గ్రామాల్లో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. బోర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. మురుగునీటి సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా గ్రామ పంచాయతీ స్థాయిలో పరిశుభ్రత కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు గ్రామాల అభివృద్ధికి దోహదపడే పనులను ప్రాధాన్యంగా చేపట్టాలని పేర్కొన్నారు. చెరువుల పూడికతీత, గ్రామ రహదారుల అభివృద్ధి, పారిశుధ్య పనులు వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు పాల్గొని తమ మండలాల్లో అమలవుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సమావేశంలో పేర్కొన్నారు.
