ఫోన్‌పే, HDFC భాగస్వామ్యంతో సరికొత్త క్రెడిట్ కార్డ్ !

ఫోన్‌పే, HDFC బ్యాంక్ సంయుక్తంగా ఈరోజు ‘ఫోన్‌పే HDFC బ్యాంక్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్’ను ఆవిష్కరించాయని ప్రకటించాయి. ఈ సరికొత్త మైలురాయితో ఫోన్‌పే కో-బ్రాండెడ్ కార్డ్ విభాగంలోకి అడుగుపెట్టింది. HDFC బ్యాంక్‌ భాగస్వామ్యంతో తీసుకొచ్చిన ఈ కొత్త రకం కో-బ్రాండెడ్ RuPay క్రెడిట్ కార్డ్‌లను భారతీయ యూజర్ల ఆర్థిక అవసరాలను తీర్చే విధంగా రూపొందించారు.

ముఖ్యంగా ఫోన్‌పే ప్లాట్‌ఫామ్‌లో UPI పేమెంట్లు చేసే యూజర్లకు ప్రయోజనాలు అందించేలా తీర్చిదిద్దారు. HDFC బ్యాంక్, ఫోన్‌పే మధ్య కుదిరిన ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఆయా సంస్థల బ్యాంకింగ్, ఫిన్‌టెక్ సామర్థ్యాలను ఉపయోగించి, క్రెడిట్ కార్డ్‌లను అందుబాటులోకి తీసుకురావడానికి, అలానే వాటిని యూజర్-ఫ్రెండ్లీగా మార్చడానికి వీలవుతుంది.

‘అల్టిమో’, ‘యునో’ వేరియంట్లలో వచ్చిన ఈ కార్డ్‌లు రీఛార్జ్, బిల్లు పేమెంట్లు, ప్రయాణం, ఆన్‌లైన్ షాపింగ్, కిరాణా సామగ్రి, క్యాబ్‌లు వంటి ప్రముఖ కేటగిరీల్లో చేసే పేమెంట్లపై రివార్డ్‌లను అందిస్తాయి. అంతేగాక, ఈ కార్డ్‌లను UPIకి సజావుగా అనుసంధానించవచ్చు, దీంతో యూజర్లు తమ రోజువారీ ఖర్చులకు క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్లు చేయవచ్చు. అలానే UPI QRలను ఎనేబుల్ చేసిన విశాలమైన మర్చంట్‌ నెట్‌వర్క్‌లో ఈ క్రెడిట్‌ కార్డ్‌లతో పేమెంట్లు చేస్తూ, వాటిపై వచ్చే రివార్డులను ఆస్వాదించవచ్చు.

ఈ లాంచ్ సందర్భంగా ఫోన్‌పేలో కన్జ్యూమర్‌ పేమెంట్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనికా చంద్ర మాట్లాడుతూ, “HDFC బ్యాంక్‌ భాగస్వామ్యంతో మేము తీసుకొచ్చిన మా మొదటి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను లాంచ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా విస్తృత శ్రేణి యూజర్లకు వినూత్న ఆర్థిక పరిష్కారాలను అందించడంలో మాకు ఉన్న నిబద్ధతను నొక్కి చెబుతుంది. బిల్లు పేమెంట్లు, రీఛార్జ్‌లు, ట్రావెల్ బుకింగ్‌లు వంటి ఎంపిక చేసిన కేటగిరీల్లో 10% రివార్డ్ పాయింట్లు ఈ కార్డ్‌తో వస్తాయి, ఫోన్‌పే కస్టమర్లు సాధారణంగా చేసే ఖర్చుల్లో కొంత విలువను తిరిగి ఇవ్వడమే ఈ కార్డ్ ఉద్దేశం. అంతేగాక, లక్షలాది మంది UPI మర్చంట్లకు పేమెంట్లు చేయడం కోసం ఈ కార్డ్‌ను యూజర్లు సజావుగా ఉపయోగించవచ్చు. HDFC బ్యాంక్‌తో మా వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు, ఈ కార్డ్ అందించే ప్రయోజనాల వల్ల లక్షలాది మంది భారతీయుల క్రెడిట్ కార్డ్ వినియోగ అనుభవం మరింత కొత్తగా మారుతుందని మేము నమ్ముతున్నాము” అని అన్నారు.

HDFC బ్యాంక్, పేమెంట్లు, లయబిలిటీ ప్రోడక్ట్‌లు, కన్జ్యూమర్ ఫైనాన్స్ & మార్కెటింగ్ విభాగాల కంట్రీ హెడ్ పరాగ్ రావు మాట్లాడుతూ, “భారతదేశంలో క్రెడిట్‌కార్డ్‌లు మంజూరు చేసేవాళ్లలో అగ్రస్థానంలో ఉన్న మేము, మా కస్టమర్ల కోసం ప్రభావవంతమైన, అనుకూలమైన ఆఫర్లను రూపొందించడానికి, అలానే విలువైన మార్గాల్లో క్రెడిట్ యాక్సెస్‌ను విస్తరించడానికి మేము నిరంతరం ప్రయత్నిస్తాము. ఫోన్‌పేతో మా భాగస్వామ్యం వల్ల స్థానిక డిజిటల్ యూజర్ల బేస్‌కు దగ్గరయ్యే అవకాశం మాకు కలుగుతుంది, ముఖ్యంగా భారతదేశ డిజిటల్ పేమెంట్ల ఎకోసిస్టమ్‌ వ్యవస్థకు కేంద్రంగా మారిన UPI ఇంటర్‌ఫేస్‌లో క్రెడిట్ కార్డ్‌లను మరింత ప్రయోజనకరంగా, విస్తృతంగా ఉపయోగించగలిగేలా చేస్తుంది. ఈ కో-బ్రాండెడ్ కార్డ్‌తో, మా విశ్వసనీయమైన క్రెడిట్ కార్డ్ ప్లాట్‌ఫామ్, ఫోన్‌పే కస్టమర్-కేంద్రీకృత డిజిటల్ అనుభవాలు కలగలసిన రెండు ఎకోసిస్టమ్‌ల్లోని ఉత్తమ ప్రయోజనాలను యూజర్లు ఏకకాలంలో పొందుతారు” అని చెప్పారు.

Leave a Reply