HYD | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌తి రోజూ యోగా చేయ‌డం వ‌ల్ల సంపూర్ణ ఆరోగ్యం ల‌భిస్తోంద‌ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ (Damodar Raja Narasimha) అన్నారు. ప్ర‌పంచ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే వేడుకలను ఆయుష్, ఆరోగ్యశాఖ సంయుక్తంగా శ‌నివారం ఘనంగా నిర్వహించాయి. ఈ అధికారిక కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Verma), ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి (Vakiti Srihari), స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు ఇతర ప్రముఖులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు‌. అలాగే ఐదు వేల మంది విద్యార్థులు, యువకులు, యోగా సాధకులు పాల్గొని యోగాసనాలు వేశారు.

ప్ర‌పంచానికి భార‌త దేశం అందించిన గొప్ప వ‌రం …
ప్ర‌పంచానికి భార‌తదేశం అందించిన గొప్ప వ‌రం యోగా అని మంత్రి రాజ‌న‌ర్సింహ అన్నారు. ప్రపంచానికి ఈ వరాన్ని అందించిన గురువు, మహర్షి పతంజలి ని ఈ సందర్భంగా మనందరం స్మరించుకోవాలని అన్నారు. ప‌తంజ‌లి (Patanjali) అందించిన అష్టాంగ యోగ విద్యలే, ప్ర‌స్తుత‌ యోగాకు ప్రాణాధారమని, యోగా (Yoga) అనేది కేవలం వ్యాయామానికి సంబంధించినది కాదని శరీరం, మనసు, ఆత్మను ఏకం చేసే అద్భుతమైన సాధనమని వివ‌రించారు. ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవన శైలితో బీపీ, షుగర్, కేన్సర్లు, కిడ్నీ సమస్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, కోట్లు సంపాదించే వారికి కూడా ప్రశాంతత ఉండడం లేదని, ఇటువంటి సమస్యలన్నింటికీ యోగా చక్కని పరిష్కార మార్గం చూపుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

630 యోగా గురువుల నియ‌మించిన ప్ర‌భుత్వం…
యోగాను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 630 మంది యోగా గురువుల (Yoga teachers) ను నియ‌మించిన‌ట్లు, మరో 264 మంది యోగా గురువుల నియామక ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. హెల్త్ సబ్‌సెంటర్లలో రోజూ ఉదయం యోగా క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది కాలంలో కొత్తగా ఐదు లక్షల మందికి యోగా నేర్పించామన్నారు. అన్ని విద్యా సంస్థల్లో యోగా నేర్పించేలా ప్రోత్సహిస్తున్నామని, నేచురోపతి, యోగిక్ సైన్సెస్‌లో పీజీ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల ద్వారా ప్రజలకు యోగాను చేరువ చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply