- అధికారులు హై అలర్ట్
పిఠాపురం: మొంథా తుపాన్ ప్రభావం పిఠాపురం నియోజకవర్గంపై తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది. తీరప్రాంత గ్రామాల్లో సహాయక చర్యలు పకడ్బందీగా కొనసాగుతున్నాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతర పర్యవేక్షణలో పిఠాపురం, కాకినాడ జిల్లాల్లో అధికార యంత్రాంగం విపత్తు నిర్వహణ చర్యలను వేగవంతం చేసింది. గంట గంటకూ నివేదికలు స్వీకరిస్తూ, పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ తేజ, కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ బిందు మాధవ్‌లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా తుపాన్ పరిస్థితులను పరిశీలించారు.
తీరప్రాంత గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియబమించారు. ఉప్పాడ, మూలపేట, కోనపాపపేట, అమీనాబాద్, అమరవిల్లి ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ ఉప్పాడలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
34 మంది సభ్యులతో ఎన్డీఆర్ఎఫ్ బృందం, 12 మంది క్విక్ రెస్పాన్స్ టీమ్, 12 మంది గజఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు. మొత్తం 34 బోట్లు సిద్ధంగా ఉంచారు. అదనంగా, విద్యుత్ అంతరాయాలు ఎదురైనా తక్షణ చర్యలు తీసుకునేందుకు 500 విద్యుత్ స్తంభాలు స్టాండ్‌బైగా ఉంచారు.
పిఠాపురం నియోజకవర్గంలో 25 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. అక్కడ 12 వేల మందికి మధ్యాహ్న భోజనం, 15 వేల మందికి రాత్రి భోజనం అందిస్తున్నారు. తాగునీటి కోసం 1.5 లక్షల వాటర్ ప్యాకెట్లు, 5 వేల పాల ప్యాకెట్లు, ట్యాంకర్లు సిద్ధంగా ఉంచారు.
పశువుల కోసం పశుగ్రాసం, ప్రజల కోసం అవసరమైన మందులు, వైద్య సిబ్బంది, జనరేటర్లు సిద్ధంగా ఉన్నాయి. జలవనరుల శాఖ, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, అగ్నిమాపక శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిఠాపురం ప్రజల భద్రతే ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.

